బరువు తగ్గటం, తగ్గిన బరువును నియంత్రించుకోవడం చాలామందికి ఒక పెద్ద సవాలుగా వుంటుంది. కాని డయాబెటీస్ వున్న వారికి బరువు, వ్యాయామాలు ఆరోగ్యంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. వ్యాయామం రక్తంలోని గ్లూకోజ్ స్ధాయి నియంత్రించి టైప్ 2 డయాబెటీస్ రాకుండా చేస్తుంది. గ్లైసిమిక్ నియంత్రణ మెరుగుపరుస్తుంది. ఇప్పటికే డయాబెటీస్ వున్నవారు, క్రమం తప్పని వ్యాయామంతో శరీరం ఇన్సులిన్ బాగా ఉత్పత్తి చేసేలా, బరువు తగ్గేలా చేసుకోవచ్చు.
బరువు వుంటే అది తగ్గటం డయాబెటీస్ కు ఎంతో మంచిది. టైప్ 2 డయాబెటీస్ వున్నవారు బరువు తగ్గి ఇకపై ఆహారం నియంత్రిస్తూ వ్యాధిని అదుపులో వుంచుకునేవారు చాలా మంది వున్నారు. బరువు తగ్గాలంటే సరైన మార్గం వ్యాయామం చేసి శారీరక చురుకుదనాన్ని పొందటమేనని రీసెర్చి రుజువు చేస్తోంది. బరువు తగ్గితే, గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటివి కూడా రాకుండా వుంటాయి.
శరీర బరువు తగుమాత్రంగా అంటే 5 నుండి 10 శాతం తగ్గినప్పటికి మంచిదే. ఆరోగ్యకర ఆహార ప్రణాళికలకు తగిన పోషకాహార నిపుణులను లేదా వైద్యులను సంప్రదించి ఆచరించాలి. ఎవరికి వారు ఒకే సారి బరువు తగ్గి, ఆరోగ్య సమస్యలు తెచ్చుకోకుండా వుండాలని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. మహిళలు, ప్రత్యేకించి గర్భవతులు, వారిలో వచ్చే జెస్టేషనల్ డయాబెటీస్ నియంత్రణకు తగిన వైద్య సలహాలు పొంది నియంత్రించుకోవాలి.