ఫేస్‌బుక్, జీమెయిల్, ఐఆర్‌సీటీసీ, ట్రాఫిక్ చలాన్.. లేదా మరే ఇతర వెబ్ సైట్‌లో అయినా మనకు కాప్చా (CAPTCHA) కోడ్ కనిపిస్తూ ఉంటుంది తెలుసు కదా. దీన్ని ఎంటర్ చేస్తేనే సదరు వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యేందుకు, లేదా సైట్‌లో ఏదైనా టాస్క్‌ను పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే కాప్చా అనేది ఎందుకు అంటే.. వెబ్‌సైట్ సెక్యూరిటీకి అని చాలా మందికి తెలుసు. కానీ కొందరికి మాత్రం అసలు ఇది అవసరమా అనే సందేహం వస్తుంది. మరి అలాంటి వారికి కలిగే సందేహాలను ఇప్పుడు తీర్చుకుందామా..!
కాప్చా (CAPTCHA) అంటే Completely Automated Public Turing test to tell Computers and Humans Apart అని అర్థం వస్తుంది. అంటే కంప్యూటర్లు, మనుషులు వేర్వేరు, రెండూ ఒకటి కాదు అని అర్థం వస్తుంది. అంటే.. సాధారణంగా మనం ఏదైనా సైట్‌లో లాగిన్ అవదలచుకున్నా, పేమెంట్ చేయాలనుకున్నా, ఏదైనా సబ్‌మిట్ చేయాలనుకున్నా ఈ కాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాప్చా లేకపోతే వెబ్‌సైట్లను యాక్సెస్ చేసే వారు మనుషులా లేక ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాములా అనే విషయం వెబ్‌సైట్ నిర్వాహకులకు తెలియదు. దీంతోపాటు కాప్చా లేకపోతే సెక్యూరిటీ ఉండదు. హ్యాకర్లు స్పా సృష్టించి వైరస్‌లను వ్యాపింపజేసేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. కనుకనే చాలా మంది నేటి తరుణంలో తమ తమ వెబ్‌సైట్లలో కాప్చాను వాడుతున్నారు. ఈ క్రమంలో యూజర్ ఎవరైనా సదరు వెబ్‌సైట్‌లో నిర్దిష్టమైన సేవను పొందాలంటే ఆయా సమయాలలో కాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి ముందుకు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది.
ఇక కాప్చా కోడ్‌లు కొన్ని సార్లు పూర్తిగా నంబర్లు ఉంటాయి. లేదంటే కొన్ని సార్లు పూర్తిగా ఆంగ్ల అక్షరాలు ఉంటాయి. ఇక కొన్ని సైట్లలో నంబర్లు, ఇంగ్లిష్ అక్షరాల కాంబినేషన్‌లో ఉంటాయి. ఇవే కాకుండా, గణిత సమస్యలను సాధించమని, లేదంటే కాప్చాలో ఉన్న ఒకే తరహా ఫొటోలను గుర్తించమని.. ఇలా రక రకాలుగా కాప్చాలను నేటి తరుణంలో వెబ్‌సైట్లలో పెడుతున్నారు. ఇక కొన్ని సందర్భాల్లో అయితే కాప్చా కోడ్‌లో ఉన్న నంబర్లు లేదా అక్షరాలు కనిపించవు. మసకగా ఉంటాయి. దీన్నే డిస్టార్టెడ్ టెక్ట్స్ అంటారు. ఇలా చేయడం వల్ల ఈ కోడ్‌ను ఆటోమేటిక్ ప్రోగ్రామ్‌లు గుర్తించలేవు. కేవలం మనుషులమైన మనకే అది సాధ్యమవుతుంది. దీంతో సదరు ప్రోగ్రామ్‌లు వీటిని వాడలేవు. ఇలా మనకు రక్షణ ఉంటుంది. అయితే కొన్ని సార్లు మాత్రం కాప్చాను సరిగ్గా ఎంటర్ చేయడంలో యూజర్లు విఫలమవుతారు. దీంతో వారికి చిరాకు రావడం సహజం. అయినా అలా విసుగు చెందకుండా మళ్లీ కాప్చాను ఎంటర్ చేయాలి. నిజానికి అది మన సెక్యూరిటీ కోసమే. కాప్చా లేకపోతే హ్యాకర్లు రెచ్చిపోతారు. ఆటోమేటిక్ మెసేజ్‌లు, స్పాంలు, వైరస్‌లతో విజృంభిస్తారు. వెబ్‌సైట్లలోకి ఆటోమేటిక్ లాగిన్ అవుతారు. దీంతో మనకు ఇబ్బందులు వస్తాయి. కనుక వెబ్‌సైట్లలో కాప్చా ఉండడమే ఉత్తమం. దాంతో మనం వెబ్‌సైట్లలో చేసే పనులకు రక్షణ ఉంటుంది.
కాగా ఏ వెబ్‌సైట్‌లో అయినా కాప్చా అనేది అప్పటికప్పుడు క్రియేట్ అవుతుంది. ఇందుకోసం అందులో ప్రత్యేక ప్రోగ్రామింగ్ ను ముందుగానే సెట్ చేసి ఉంచుతారు. ఈ క్రమంలో యూజర్ కాప్చాను జనరేట్ చేయగానే సదరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాప్చాను జనరేట్ చేస్తుంది. దీంతో కాప్చాను మనం ఎంటర్ చేయగానే అది కరెక్ట్ అయితే వెబ్‌సైట్‌లోకి యాక్సెస్ లభిస్తుంది. కాప్చా కోడ్‌ను 2000వ సంవత్సరంలో కనిపెట్టారు. కార్నిగీ మెలాన్ యూనివర్సిటీకి చెందిన లూయీస్ వాన్, మానువల్ బ్లమ్, నికోలాస్ జె హాపర్, జాన్ లాంగ్‌ఫోర్డ్‌లు కాప్చాను క్రియేట్ చేశారు. అప్పటి నుంచి ఒక్కో స్టెప్ కాప్చా డెవలప్ అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే భిన్న తరహా కాప్చాలు ఇప్పుడు మనకు ఆయా వెబ్‌సైట్‌లలో కనిపిస్తున్నాయి. ఇవీ… కాప్చాకు సంబంధించిన విశేషాలు..!