Kanuga Tree : కానుగ చెట్టు.. ఇది తెలియని వారుండరని చెప్పవచ్చు. రోడ్లకు ఇరువైపులా, పార్కుల్లో, ఖాళీ ప్రదేశాల్లో ఈ మొక్కను ఎక్కువగా పెంచుతూ ఉంటారు. ఈ చెట్టులేని గ్రామం ఎక్కడ ఉండదనే చెప్పవచ్చు. చల్లటి నీడను, స్వచ్ఛమైన గాలిని అందించడంలో కానుగ చెట్టు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. పంటలకు వచ్చే రోగాలతో పాటు మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా కానుగ చెట్టు మనకు ఎంతగానో దోహదపడుతుంది. దీనిని సంస్కృతంలో కరంజక, సప్తమాల అని హిందీలో కరంజా అని పిలుస్తారు. కానుగ చెట్టు పూలు గుత్తులు గుత్తులుగా నీలం, తెలుపు రంగుల్లో ఉంటాయి. కానుగ గింజల నుండి నూనెను కూడా తీస్తారు. దీనిని పూర్వకాలంలో దీపాలు వెలిగించుకోవడానికి ఉపయోగించే వారు. కానుగ చెట్టులో ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.
కానుగ చెట్టు వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కానుగ చెట్టు ఆకులను, జిల్లేడు చెట్టు ఆకులను, జాజి చెట్టు ఆకులను సమానంగా తీసుకుని గోమూత్రంతో కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై లేపనంగా రాయడం వల్ల సమస్త చర్మ వ్యాధులు తగ్గుతాయి. కానుగ పప్పును 3 గ్రాములు మోతాదులో తీసుకుని దానిని పొడిగా చేయాలి. ఈ పొడిని 50 గ్రాముల ఆవు పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యలు తగ్గు ముఖం పడతాయి. 10 గ్రాముల కానుగ పప్పును, 10 పిప్పిళ్లను, 5 గ్రాముల తుమ్మ జిగురును నీటితో కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని శనగగింజలంత పరిమాణంలో మాత్రలుగా చేసుకుని ఆరబెట్టాలి. ఇలా తయారు చేసుకున్న మాత్రలను పూటకు ఒక మాత్ర చొప్పున మూడు పూటలా తీసుకోవడం వల్ల అన్ని రకాల జ్వరాలు తగ్గుతాయి.

కానుగ గింజల పప్పును పొడిగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పూటకు ఒక గ్రాము చొప్పున రెండు పూటలా అర టీ స్పూన్ తేనెతో కలిపి పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో వచ్చే కోరింత దగ్గు తగ్గుతుంది. పురుషుల్లో వచ్చే వ్రణాల వాపు సమస్యను తగ్గించడంలో కూడా కానుగ చెట్టు మనకు ఉపయోగపడుతుంది. కానుగ పప్పును, ఆముదం గింజల పప్పును, గచ్చ కాయల పప్పును సమానంగా తీసుకుని వంట ఆముదంతో కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రించే ముందు వాచిన వృషణాలపై లేపనంగా రాసుకోవాలి. ఉదయాన్నే నీటితో కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల వృషణాల సమస్య నుండి బయట పడవచ్చు. కానుగ కాయలను నల్ల దారానికి గుచ్చి పిల్లల మెడలో కట్టాలి. ఇలా కట్టడం వల్ల వారికి అంటూ వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే వారిలో కంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
కానుగ పూల పొడిని పూటకు 3 గ్రాముల చొప్పున రెండు పూటలా గోరు వెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల అతిమూత్రం సమస్య తగ్గడంతో పాటు మూత్రాశయ ఇన్ఫెక్షన్ లు కూడా తగ్గుతాయి. కానుగ బెరడును కానీ, కానుగ చెట్టు వేరు బెరడును కానీ తీసుకుని దంచి రసాన్ని తీయాలి. ఈ రసానికి సమానంగా ఆముదం నూనె కలిపి నూనె మిగిలే వరకు మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను గోరు వెచ్చగా చేసి రెండు పూటలా పక్షవాతం కారణంగా పడిపోయిన శరీర భాగాలపై రాసి మర్దనా చేయడం వల్ల ఆ భాగాలు మరలా సాధారణ స్థితికి వస్తాయి. కానుగ పప్పును నెయ్యిలో వేసి నల్లగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ఈ నెయ్యిని వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నెయ్యిని 3 నుండి 4 చుక్కల మోతాదులో గోరు వెచ్చగా చెవిలో వేసుకోవడం వల్ల చెవుడు సమస్య తగ్గుతుంది.
అరికాళ్లల్లో మంటలతో బాధపడే వారు కానుగ చెట్టు లేత ఆకులను, రావి చెట్టు లేత ఆకులను కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని నీటిలో వేసి కషాయంలా చేసుకుని వడకట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని కప్పు మోతాదులో రెండు పూటలా తాగడం వల్ల అరికాళ్లల్లో మంటలు తగ్గుతాయి. కానుగ చెట్టు పుల్లలతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల అన్ని రకాల దంతాల సమస్యలు, చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. దంతాలు కూడా తెల్లగా మారతాయి. ఈ విధంగా కానుగ చెట్టు మనకు ఎంతో మేలు చేస్తుందని దీనిని ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.