ఈ మధ్య కాలంలో కొన్ని వింతలు,విచిత్రాలు సాక్షాత్కరింపబడుతున్నాయి. వాటిని చూసి ప్రజలు ఆశ్చర్యపోవడం మనం చూస్తున్నాం. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలో ఓ గుహలో ఉన్న సాధువు అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన ఒంటి మీద బట్టలు లేకుండా, పొడవైన తెలుపు రంగు గడ్డంతో, ఒంటి మీద కండ లేకుండా మరీ బక్క చిక్కిపోయి కనిపించడంతో ఆయనని ప్రతి ఒక్కరు కూడా తమ ఫోన్‌లలో బంధించారు. ఈ క్రమంలో అతనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. అయితే 24 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఆ సాధువును గుహలో నుంచి బయటికి తీసుకువస్తున్నట్లు ఉంది. అయితే ఆ సాధువుకు 188 ఏళ్ల వయసు ఉంటుందని పేర్కొనడంతో అందరు అవాక్కవుతున్నారు.
ఓ సోషల్ మీడియోలో సాధువు వీడియో షేర్ కాగా, ఇందులో ఆయనకి 188 ఏళ్ల వయసు ఉంటుందని వారు చెప్పినా.. అంత వయసు ఉంటుందంటే నెటిజన్లు ఏ మాత్రం నమ్మడం లేదు. ఈ క్రమంలోనే అతడి వయసును నిర్ధారించేందుకు ఎంతో మంది రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది.. అయితే కొన్ని వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం ఆ సాధువును మధ్యప్రదేశ్‌కు చెందిన హిందూ సన్యాసి అయిన సియారాం బాబా అని గుర్తించారు. అతడి వయసు 110 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఖార్గోనే జిల్లాకు చెందిన సియారాం బాబా ఒంటి కాలిపై 10 ఏళ్ల పాటు తపస్సు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అతను 109 ఏళ్ల వయస్సులో కళ్లద్దాలు లేకుండానే తన పనులు తాను చేసుకుంటూ , అలానే రామాయణాన్ని చదివినట్లు తెలుస్తోంది. సియారాం బాబా చాలా తక్కువ మాట్లాడతారని.. అయినప్పటికీ ఆయన ఆశీస్సుల కోసం భక్తులు భారీగా పోటెత్తుతారని సమాచారం.
మధ్యప్రదేశ్ ఖార్గోనే జిల్లాలోని నర్మదా నది ఒడ్డున ఉన్న భాట్యన్ ఆశ్రమంలో సియారాం బాబా నివసించేవారని తెలుస్తోంది. అయితే ఆయన వయసు గురించి ఎలాంటి స్పష్టత లేకపోయినప్పటికీ.. 109 లేదా110 ఏళ్లు ఉంటాయని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం ఆయన వయసు 130 ఏళ్లు ఉంటుందని పేర్కొంటున్నారు. మరి ఆయన కరెక్ట్ వయస్సు ఎంత అనే దానిపై క్లారిటీ అయితే రావలసి ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఆయన వయస్సు గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తుంది.