డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా…? ఎంతంటే అంత ఇవ్వడానికి… ఖర్చు పెట్టడానికి..! అనే మాటను మనం తరచూ పలు సందర్భాల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. అలా అన్నప్పటికీ డబ్బులు మాత్రం చెట్లకు కాయవు కదా. వాటిని కష్టపడే సంపాదించాలి. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే చెట్లకు మాత్రం నిజంగానే డబ్బులు ఉన్నాయట. కానీ అవి కాయలు, పండ్లలా కాసినవి కావు. మరి ఆ డబ్బులు చెట్లపైకి ఎలా వచ్చాయనేగా మీ డౌట్. మరికెందుకాలస్యం… ఈ చెట్లు ఏవో, అవి ఎక్కడ ఉన్నాయో, వాటిపైకి డబ్బులు ఎలా చేరాయో… ఇప్పుడు తెలుసుకుందాం.
అది వుడ్‌ల్యాండ్. వుడ్ ల్యాండ్ అంటే బూట్లు, పర్సులు అమ్మే బ్రాండెడ్ కంపెనీ కాదు. అదొక ప్రాంతం. ఇంగ్లండ్‌లో ఉంది. అయితే కొన్ని వందల ఏళ్ల కిందట ఈ ప్రాంతంలో ఉండే స్థానికులు అక్కడ ఉన్న అనేక చెట్లపై (వాటి కాండాలపై) నాణేలను పెట్టేవారట. అలా ఎందుకు చేసే వారు అంటే… ఆయా చెట్ల మీద దైవ సంబంధ ఆత్మలు ఉన్నాయని వారు నమ్మేవారు. అందుకే ఆ చెట్ల కాండాలపై నాణేలను గుచ్చేవారు. అలా చేస్తే ఆ ఆత్మలు శాంతించి వారు కోరిన కోరికలు తీరుస్తాయని వారి నమ్మకం. అందులో భాగంగానే వారు అలా చేసే వారు. అయితే ఒకప్పుడు వారు అలా చేసే సరికి వుడ్ ల్యాండ్ ప్రాంతంలో ఉన్న అన్ని చెట్లలో నాణేలు నిండిపోతూ వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న చెట్లపై కొన్ని వేల నాణేలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. దీంతో ఆ చెట్లను ఇప్పుడు మనీ ట్రీలు అని పిలుస్తున్నారు.
అయితే ఒకప్పుడు పూర్వీకులు పాటించిన ఆ ఆచారం ఇప్పటికీ కొందరు పాటిస్తున్నారట. దీంతో ఆ చెట్లపై ఉండే నాణేల సంఖ్య మరింత పెరిగిందట. ప్రతి ఏడాది క్రిస్మస్ రోజున ఈ చెట్లపై అనేక మంది నాణేలను పెట్టి తమ కోర్కెలు నెరవేరాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ చెట్లు ఇంకా మనీ ట్రీలుగానే పిలవబడుతున్నాయి. అయితే కొత్త వారికి మాత్రం వాటిని చూస్తే నిజంగానే డబ్బులు చెట్లకు కాసాయని అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ వింత మనీ ట్రీలు భలే వింతగా ఉన్నాయి కదా..!