Khushi Kapoor : అలనాటి అందాల తార శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పటికే వెండితెరకు పరిచయం అయి పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన సినిమాలు హిట్ కాకున్నా.. ఆమెకు నటిగా మంచి పేరు అయితే వచ్చింది. ఇక ఈమె తెలుగు తెరకు కూడా పరిచయం అవుతుందని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. కానీ వాటిల్లో స్పష్టత లేదు. జాన్వీ తండ్రి బోనీ కపూర్ ఈ విషయాన్ని గతంలో చెప్పారు. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ కూడా వెండితెరకు పరిచయం అవబోతోంది. త్వరలో ఆమె ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొననుంది.
ఇటీవల బోనీ కపూర్ తన కుమార్తె ఖుషి కపూర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఖుషి కపూర్‌కు యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని.. ఆమె త్వరలోనే ఓ సినిమాలో నటించనుందని తెలిపారు. అయితే అది ఏ సినిమా.. అందులో ఇంకా ఎవరెవరు నటిస్తున్నారు.. అనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ ఖుషి కపూర్ తెరంగేట్రం మాత్రం కన్‌ఫామ్ అయిపోయింది.
ఇక ఆమె ఏప్రిల్‌లో తన తొలి మూవీ షూటింగ్‌లో పాల్గొంటుందని తెలుస్తోంది. అందులో షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ తోపాటు అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద కూడా నటిస్తారని తెలుస్తోంది. ఆ సినిమాను జోయా అక్తర్ తెరకెక్కించనున్నారు. ఈ క్రమంలో ఖుషి కపూర్ వెండితెరపై ఎలా నటిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.