Irani Chai : హైదరాబాద్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది.. ఇక్కడి ఇరానీ చాయ్. హైదరాబాద్‌లోని పలు ప్రముఖ కేఫ్‌లలో ఇరానీ చాయ్ మనకు లభిస్తుంది. అయితే ఇప్పుడు మనకు అంతటా ఇరానీ చాయ్ చాలా సులభంగానే లభిస్తోంది. కానీ దీన్ని బయటే తాగాలి. దీన్ని ఎలా తయారు చేయాలో తెలియదు. కింద తెలిపిన విధంగా చేస్తే ఇంట్లోనే చాలా సులభంగా ఇరానీ చాయ్‌ను తయారు చేసుకుని తాగవచ్చు. ఇక దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇరానీ చాయ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అల్లం – కొద్దిగా, యాలకులు – 3, నీళ్లు – ఒక గ్లాసు, టీ పొడి – రెండున్నర టీ స్పూన్స్, చక్కెర – మూడు టీ స్పూన్స్, కాచి చల్లార్చిన పాలు – ఒక గ్లాసు.
ఇరానీ చాయ్ తయారీ విధానం..
ముందుగా అల్లం, యాలకులను కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీళ్లను పోసి దానిపై శుభ్రమైన వస్త్రాన్ని ఉంచాలి. ఇప్పుడు గిన్నెలో ఉండే నీళ్లను కొద్దిగా తాకేలా వస్త్రాన్ని ఉంచి, దారం సహాయంతో వస్త్రాన్ని గిన్నెకు కట్టాలి. ఇప్పుడు వస్త్రంపై ఉండే నీళ్లలో టీ పొడిని, దంచి ఉంచుకున్న అల్లం, యాలకులను వేయాలి. ఈ గిన్నెను ఒక కుక్కర్ లో నీళ్లను పోసి అందులో ఉంచాలి. ఇప్పుడు కుక్కర్ పై మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. తరువాత కుక్కర్ మూత తీసి గిన్నెపై ఉంచిన వస్త్రాన్ని, టీ పొడితో సహా తొలగించాలి. గిన్నెలో తయారయిన డికాషన్ ను టీ చేసుకునే గిన్నెలో పోసి, ఇందులోనే చక్కెర, కాచి చల్లార్చిన పాలను వేసి మరిగించాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఇరానీ చాయ్ తయారవుతుంది. ఈ చాయ్ ను ఎంత ఎక్కువగా మరిగిస్తే అంత రుచిగా ఉంటాయి.