Chintakaya Charu : మనం వంటింట్లో కూరలనే కాకుండా పప్పు చారు, సాంబార్, పులుసు కూరల వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాం. వీటి తయారీలో మనం చింతపండును ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే వివిధ రకాల పచ్చళ్ల తయారీలో కూడా చింతపండును ఉపయోగిస్తూ ఉంటాం. మనం చింతపండునే కాకుండా పచ్చి చింతకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని కూడా వంటల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. చాలా మంది వీటిని నేరుగా తింటూ ఉంటారు కూడా.
చింతపండు లాగానే పచ్చి చింతకాయలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, గుండెను ఆరోగ్యంలో ఉంచడంలో, కాలేయ పని తీరును మెరుగుపరచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. పచ్చి చింతకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే చారును తయారు చేసుకోవచ్చు. వీటితో చారుతో తయారు చేయడం చాలా సులభం. పచ్చి చింతకాయలతో చారును ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చింతకాయ చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
చింతకాయలు – తగినన్ని, నానబెట్టిన కందిపప్పు – ఒక కప్పు, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – తగినంత, తరిగిన పచ్చి మిర్చి – 3, తరిగిన ఉల్లిపాయ – 1.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఆవాలు – పావు టీ స్పూన్, శనగ పప్పు – అర టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, వెల్లుల్లి రెబ్బలు – 4 లేదా 5, నూనె – 2 టీ స్పూన్స్, ఎండు మిర్చి – 2.
చింతకాయ చారు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మన రుచికి తగినన్ని చింతకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లను పోసి చింతకాయలు మెత్తగా అయ్యే ఉడికించుకోవాలి. చింతకాయలు ఉడికిన తరువాత పైన ఉండే పొట్టును తీసేసి చింతకాయల నుండి గుజ్జును తీసి పక్కకు పెట్టుకోవాలి. మరో గిన్నెలో కందిపప్పును తీసుకుని తగినన్ని నీళ్లను పోసి ఉడికించాలి. ఇప్పుడు కందిపపప్పులో ఉన్ననీళ్లను మరో గిన్నెలోకి తీసుకుని ఉడికించిన కంది పప్పును జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పడు గిన్నెలో తగినన్ని నీళ్లను తీసుకుని అందులో తరిగిన ఉల్లిపాయలను, పచ్చి మిర్చిని వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు ముందుగా పేస్ట్ లా చేసి పెట్టుకున్న కందిపప్పును వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
తరువాత ముందుగా తీసిపెట్టుకున్న చింతకాయ గుజ్జును వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత పసుపును, ఉప్పును, కారాన్ని వేసి కలిపి మరో 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపు వేగిన తరువాత మరుగుతున్న చారులో వేసి కలిపి మూత పెట్టి మరో 3 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చింతకాయ చారు తయారవుతుంది. ఈ చారును అన్నంతో కలిపి తింటే రుచిగా ఉండడమే కాకుండా జీర్ణ శక్తి కూడా మెరుగుపడుతుంది. నోటికి పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలా చింతకాయలతో చారును చేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది.