Pepper : ప్రతి ఒక్కరి వంటింట్లో తప్పకుండా ఉండే దినుసుల్లో మిరియాలు కూడా ఒకటి. ఇవి ఘూటుగా, కారంగా ఉంటాయి. వంటల్లో కారానికి ప్రత్యమ్నాయంగా మనం వీటిని ఉపయోగిస్తాం. మిరియాలు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో మిరియాలను విరివిరిగా ఉపయోగిస్తారు. 100 గ్రా. ల మిరియాలలో 49 గ్రా. ల పిండి పదార్థాలు, 10.5 గ్రా.ల మాసంకృత్తులు, 6.8 గ్రా.ల కొవ్వు పదార్థాలు, 14 .4 మిల్లీ గ్రాముల పీచు పదార్థాలతోపాటు కాల్షియం, ఐరన్, మెగ్నిషియం, జింక్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. మిరియాలు జీర్ణం అవ్వడానికి కనీసం రెండున్నర గంటల సమయం పడుతుంది. కేవలం జలుబు, దగ్గు వంటి వాటినే కాకుండా మిరియాలను ఉపయోగించి అనేక రోగాల నుండి బయటపడవచ్చు.
జీర్ణ క్రియను మెరుగుపరచడంలో, నోట్లో లాలాజలం ఎక్కువగా అయ్యేలా చేయడంలో, కడుపులో గ్యాస్ సమస్యను తగ్గించడంలో ఈ మిరియాలు ఎంతగానో ఉపయోగపడతాయి. శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ చురుకుగా సాగేలా చేయడంలో, ఒంట్లో కొవ్వు పేరుకోకుండా చేయడంలో, కండరాల నొప్పులను తగ్గించడంలో, మూత్ర పిండాల పని తీరును మెరుగుపరచడంలో కూడా మిరియాలు సహాయపడతాయి. అజీర్తితో బాధపడే వారు మిరియాల పొడిని, పాత బెల్లంతో కలిపి చిన్న ఉండలుగా చేసి భోజనానికి ముందు రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది. మిరియాల పొడిని బాదం పప్పుతో కలిపి తీసుకుంటే కండరాల నొప్పులు తగ్గుతాయి. అధిక బరువుతో బాధపడే వారు పావు టీ స్పూన్ మిరియాల పొడిని తేనెతో కలిపి తీసుకుని తరువాత వేడి నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు.
అధిక దాహం సమస్యతో బాధపడే వారు మిరియాల పొడిని మంచి నీటితో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తరచూ జలుబు, దగ్గుల బారిన పడే వారు నీటిలో మిరియాల పొడిని, పసుపునువేసి కలిపి మరిగించి గోరు వెచ్చగా అయిన తరువాత తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. చిగుళ్ల నుండి రక్తం కారే వారు రాళ్ల ఉప్పును, మిరియాల పొడిని కలిపి ఆ మిశ్రమంతో దంతాలను, చిగుళ్లను శుభ్రంచేసి వేడి నీటితో పుక్కిలించడం వల్ల చిగుళ్ల నుండి రక్తం కారడం తగ్గుతుంది. కీళ్ల వాపులతో బాధ పడే వారు మిరియాలను నువ్వుల నూనెలో వేయించి పొడిగా చేసి ఆ పొడిని వాపులపై ఉంచి కట్టు కట్టడం వల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. చర్మ వ్యాధులతో బాధ పడే వారు మిరియాల పొడిని నెయ్యిలో వేసి కలిపి ఆ మిశ్రమాన్ని లేపనంగా రాయడం వల్ల చర్మ వ్యాధులు తగ్గుతాయి.
3 నుండి 4 రోజుల పాటు మిరియాల పొడిని, పసుపును కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు తగ్గుతాయి. గాయాలు తగిలినప్పుడు వాటిపై మిరియాల పొడిని ఉంచడం వల్ల గాయాల నుండి రక్తం కారడం తగ్గుతుంది. అంతేకాకుండా గాయాలు త్వరగా మానుతాయి. కడుపులో మంట, శరీరంలో అధిక వేడి ఉన్న వారు మిరియాలను తక్కువ మోతాదులో తీసుకోవాలి. చిన్న పిల్లలకు పావు టీ స్పూన్, పెద్దలకు అర టీ స్పూన్ కంటే ఎక్కువ మిరియాల పొడిని ఇవ్వరాదు. మిరియాల పొడి, శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని రెండు రోజులకొకసారి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు మన దరి చేరకుండా ఉంటాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే తరచూ మిరియాలతో చేసిన చారును తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ చారును తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కూడా కరుగుతుంది.
గొంతు నొప్పి, గొంతులో గరగర వంటి సమస్యలతో బాధపడే వారు వేడి వేడి పాలలో మిరియాల పొడిని, పసుపును, తేనెను వేసి కలిపి తాగడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది. నేతిలో వేయించిన మిరియాలు శరీరానికి ఎటువంటి హాని చేయవు. తేనె, పెరుగు.. మిరియాల వల్ల కలిగే దోషాలకు విరుగుడుగా పని చేస్తాయి. నీటిలో ఒక టీ స్పూన్ మిరియాల పొడిని, గుప్పెడు తులసి ఆకులను, చిన్న అల్లం ముద్దను ఒక గ్లాస్ నీటిలో వేసి చిన్న మంటపై మరిగించి వడకట్టాలి. ఈ కషాయానికి ఒక టీ స్పూన్ తేనెను కలిపి రోజుకు రెండు పూటలా తాగడం వల్ల సాధారణ జలుబు త్వరగా తగ్గుతుంది. ఈ కషాయాన్ని ఏ పూటకు ఆ పూటగా తాజాగా తయారు చేసుకుని తాగాలి. మిరియాల పొడిని వంటలల్లో వాడడంతోపాటు ఈ విధంగా ఔషధంగా కూడా ఉపయోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.