Muscle Pain : మనం వ్యాయామాలు చేసేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు, అధికంగా పని చేసినప్పుడు మన శరీరంలో కండరాలు గట్టిగా పట్టేసినట్టు ఉండి నొప్పిని కలిగిస్తాయి. కొన్నిసార్లు కాళ్లు బెణికినప్పడు కూడా కాళ్లలో ఉండే కండరాలు నొప్పిని కలిగిస్తాయి. కొందరిలో ఇతర అనారోగ్య సమస్యల వల్ల లేదా పోషకాహార లోపం కారణంగా కూడా తరచూ కండరాలు పట్టేసినట్టు ఉండి నొప్పిని కలిగిస్తాయి. ఈ కండరాల నొప్పులు ఎక్కువగా మెడ, నడుము, భుజాలు, కాళ్ల పిక్కలు, వీపు భాగాలలో ఎక్కువగా వస్తాయి. అలాగే మనలో చాలా మంది మోకాళ్ల నొప్పులతో కూడా బాధపడుతూ ఉంటారు.
పూర్వకాలంలో ఈ మోకాళ్ల నొప్పులను మనం ఎక్కువగా వయస్సు పై బడిన వారిలో చూసే వాళ్లం. కానీ ప్రస్తుత కాలంలో యుక్త వయస్సులో ఉన్న వారు కూడా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఈ కండరాల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుండి బయటపడడానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అనేర రకాల తైలాలను, ఆయింట్ మెంట్లను, జెల్ లను రాస్తూ ఉంటాం. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ నొప్పి తగ్గకుండా మనల్ని ఎంతో బాధకు గురి చేస్తూ ఉంటాయి. ఇలాంటి నొప్పులన్నింటినీ మనం ఆయుర్వేదం ద్వారా చాలా త్వరగా నయం చేసుకోవచ్చు.
కండరాల నొప్పులను, మోకాళ్ల నొప్పులను ఆయుర్వేదం ద్వారా మనం ఎలా నయం చేసుకోవచ్చు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నొప్పులన్నింటినీ తగ్గించడంలో మనకు వావిలి చెట్టు ఎంతగానో సహాయపడుతుంది. ఈ వావిలి చెట్టు మనకు విరివిరిగా కనబడుతుంది. పూర్వకాలంలో బాలింతలకు వావిలి చెట్టు ఆకులను వేసి వేడి చేసిన నీటితో స్నానం చేయించేవారు. ఇలా చేయించడం వల్ల బాలింతల్లో ఉండే నొప్పులన్నీ పోతాయి. అలాగే వారికి ఎటువంటి ఇన్ ఫెక్షన్ లు రాకుండా ఉంటాయి. మనకు వచ్చే అన్ని రకాల కండరాల నొప్పులను, మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో వావిలి చెట్టు ఆకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.
కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు వావిలి చెట్టు ఆకులను సేకరించి వాటిపై నువ్వుల నూనెను రాసి నిప్పులపై ఉంచి వేడి చేయాలి. తరువాత వాటిని తీసుకుని నొప్పి ఉన్న చోట ఉంచి ఒక కాటన్ వస్త్రంతో గట్టిగా కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల నడవడానికి కూడా ఇబ్బందిని కలిగించే కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.