ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఎన్నో కోట్ల మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ప్రపంచంలో ఏటా అత్యధిక శాతం మంది మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో గుండె జబ్బులు రెండో స్థానంలో ఉన్నాయి. ఏటా అనేక లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా హార్ట్ ఎటాక్ల వల్ల చనిపోతున్నారు. గుండెకు సరఫరా అయ్యే రక్త ప్రవాహానికి ఏదైనా అడ్డుపడితే అప్పుడు గుండెకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. ఫలితంగా హార్ట్ ఎటాక్ లు సంభవిస్తాయి. ఈ క్రమంలో ఛాతిలో అసౌకర్యం, ఛాతిలో తీవ్రమైన నొప్పి, చేతుల్లో నొప్పిగా ఉండడం, అజీర్ణం, జీర్ణాశయంలో అసౌకర్యం, తీవ్రంగా చెమట పట్టడం, వాంతులు కావడం, ఆందోళన, అలసట, వేగంగా లేదా అసాధారణ రీతిలో గుండె కొట్టుకోవడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు అన్నీ అందరిలో కనిపించాలని ఏమీ లేదు. కొందరిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇంకొందరిలో ఇంకొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయినప్పటికీ హార్ట్ ఎటాక్ వచ్చిందంటే ఒక్కసారిగా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తారు. ఈ క్రమంలో త్వరగా స్పందించకపోతే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది.
అయితే హార్ట్ ఎటాక్ లు అనేవి ఎప్పుడు వస్తాయో చెప్పలేం. ఇందుకు ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ ఉండదు. కానీ వారంలో ఒక్క రోజులో మాత్రం హార్ట్ ఎటాక్ లు వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయని సైంటిస్టులు తేల్చారు. అవును.. సోమవారం రోజు హార్ట్ ఎటాక్‌లు ఎక్కువగా వస్తాయని తెలిపారు. అందుకు గాను సైంటిస్టులు గత 7 సంవత్సరాలుగా సుమారుగా 1,56,000 హాస్పిటళ్లలో హార్ట్ ఎటాక్‌లు వచ్చిన వారి వివరాలను సేకరించి విశ్లేషించారు. దీంతో చాలా మందికి సోమవారం రోజునే ఎక్కువగా హార్ట్ ఎటాక్‌లు వచ్చినట్లు వెల్లడైంది. ఈ అధ్యయనం వివరాలను అమెరికన్ హార్ట్ జర్నల్‌లోనూ ప్రచురించారు.
సాధారణంగా శని, ఆది వారాల్లో ఎవరైనా సరే ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలో సోమవారం రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఆఫీసుకో, కాలేజీకో, స్కూల్‌కో వెళ్లాలంటే వెళ్లబుద్ధి కాదు. ముందురోజు ఆలస్యంగా నిద్రపోతారు. దీంతో మన శరీరంలో ఉండే అంతర్గత వ్యవస్థ అయిన సర్కేడియన్ రిథమ్ దెబ్బ తింటుంది. శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. అందువల్ల సోమవారం రోజు చాలా మందికి హార్ట్ ఎటాక్ లు వస్తాయని సైంటిస్టులు తేల్చారు. కనుక వారంలో ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉంటే మేలు.
అయితే కేవలం సోమవారం రోజునే హార్ట్ ఎటాక్ వస్తుందని అనుకోకూడదు. పరిస్థితులు అనుకూలించకపోతే ఎప్పుడైనా ఎవరికైనా హార్ట్ ఎటాక్ రావచ్చు. కనుక ఆ స్థితి రాకుండా ముందుగానే జాగ్రత్త పడడం ఉత్తమం. నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పౌష్టికాహారం తీసుకోవడం, వేళకు నిద్ర పోవడం చేస్తే హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.
ఇక వారాంతాల్లో, వేసవి సెలవుల్లో హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని, చలికాలం, చలి ప్రదేశాల్లో హార్ట్ ఎటాక్ లు వచ్చే అవకాశాలు పెరుగుతాయని కూడా సైంటిస్టులు తేల్చారు.