Ravva Appam : మనం ఉదయం వివిధ రకాల అల్పాహారాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కానీ ఒక్కోసారి వీటిని తయారు చేసుకోవడానికి సమయం ఉండదు. అలాంటప్పుడు రవ్వతో కేవలం 15 నిమిషాల్లో ఇన్ స్టాంట్ గా అల్పాహారాన్ని చేసుకుని తినవచ్చు. రవ్వతో రుచిగా అలాగే త్వరగా అయ్యేలా అల్పాహారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ అప్పం తయారీకి కావల్సిన పదార్థాలు..
అటుకులు – ముప్పావు కప్పు, బొంబాయి రవ్వ – ఒక కప్పు, పెరుగు – అర కప్పు, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని, బేకింగ్ పౌడర్ – ఒక కప్పు.
రవ్వ అప్పం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో అటుకులు, బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు, ఒక కప్పు నీళ్లను తీసుకోవాలి. వీటన్నింటిని కలిపి 10 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా దోశ పిండిలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక ఒక గంటె పిండిని పెనం మీద వేయాలి. ఇలా వేసిన పిండిని రుద్దకుండా అలాగే ఉంచాలి. ఇలా వేసిన అప్పాన్ని బుడగలు వచ్చే వరకు కాల్చుకోవాలి.
తరువాత దీనిపై మూతను ఉంచి అర నిమిషం పాటు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న అప్పాన్ని ఇంకో వైపునకు వేయకుండా ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెత్తగా, రుచిగా ఉండే రవ్వ అప్పం తయారవుతుంది. దీనిని పల్లి చట్నీ, టమాట చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉదయం అల్పాహారాన్ని చేసుకునే సమయం లేనప్పుడు ఇలా రవ్వ అప్పాన్ని కేవలం 15 నిమిషాల్లోనే చేసుకుని తినవచ్చు.