Fastfood : ఈ రోజుల్లో ఎక్కడ చూసినా రెస్టారెంట్లు, హోటల్స్, దాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే కనిపిస్తున్నాయి. దానికి కారణం ఈ తరం వారు బయట దొరికే ఆహారాలను ఇష్టపడడమే. కొన్ని నగరాల్లో అయితే వీధికొక చాట్ బండార్ కనిపిస్తూ ఉంటుంది. అవి జనంతో గుమిగూడి ఉండడాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు ఎక్కడ చూసినా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే కనిపిస్తూ ఉన్నాయి. వాటిని చూడగానే మనకు నోరు ఊరినట్టు అవుతుంది. అక్కడికి వెళ్లి ఎప్పుడు తిందామా అనిపిస్తూ ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా నాన్ వెజ్ పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ నూడుల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడుల్స్, చికెన్ 65, చికెన్ మంచూరియా, చికెన్ ఫ్రై లాంటి ఆహార పదార్థాలు అక్కడ తప్పకుండా దొరుకుతాయి.
వాటిని అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తూ ఉంటారు. కొన్ని చోట్ల చికెన్ పకోడీని అప్పటికప్పుడు తయారు చేసి వేడివేడిగా ఉల్లిపాయ, నిమ్మరసం వేసి మనకు ఇస్తూ ఉంటారు. అది తింటుంటే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. బయట దొరికే చికెన్ 65, చికెన్ పకోడి వంటి వాటిని తింటే మనిషి అనారోగ్యాల బారిన పడడం ఖాయం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బయట దొరికే ఆహారపదార్థాలను తినడం బాగా అలవాటు చేసుకున్న వారు ఇంటి భోజనాలను అంతగా ఇష్టపడడం లేదని తాజాగా జరిపిన ఒక సర్వేలో వెల్లడైంది. ఇలా రోడ్లపై దొరికే ఆహార పదార్థాలు ఏమంత క్షేమం కావని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకు కారణం ఈ మధ్య కొన్ని హోటల్స్ లోను, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోను కుళ్లిన మాంసాలతో బిర్యానీ, ఫ్రైడ్ రైస్, చికెన్ పకోడి చేస్తుండడమే.
ఇలా చేస్తున్న కొంతమందిని హెల్త్ డిపార్ట్ మెంట్ వారు పట్టుకుని ఆయా హోటల్స్ ను, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను సీజ్ చేయడం జరిగింది. అసలు హోటల్స్ కు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అర్థం అప్పటికప్పుడు వండి మనకు తాజాగా వండిచేవి అని అర్థం. కానీ వాటి నిర్వాహకులు అలా తాజా పదార్థాలకు బదులు మిగిలిన చికెన్ వ్యర్థాలతోనూ, నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాలతనూ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ వంటి వాటిని వండి హోటల్ కస్టమర్లకు తాజా ఆహారం పేరుతో అందివ్వడం మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. కొన్ని చోట్ల ప్రజలు వినియోగించని కోడి వ్యర్థాలను, చర్మాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. కోడిని అమ్మగా మిగిలిన వ్యర్థాలను, చర్మాన్ని, కాళ్లను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు తక్కువ ధరలకే కొనుగోలు చేసి చికెన్ పకోడిల రూపంలో సొమ్ము చేసుకుంటున్నారు.
ఇవి వ్యర్థాలని తెలియకుండా మొక్కజొన్న పిండి, మసాలాలను దట్టించి వేయించిన నూనెలోనే మళ్లీ మళ్లీ వేయించి అమ్మేస్తున్నారు. వాటిని మాంసాహారులు లొట్టలేసుకుని మరీ తినేస్తున్నారు. ఇలా వ్యర్థాలను తినడం ద్వారా అలర్జీ, అల్సర్, గ్యాస్ ట్రబుల్ వంటి అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుచేత హోటల్ భోజనానికి పూర్తిగా స్వస్తి చెప్పి మాంసాహారం తినాలనుకుంటే ఇంట్లో వండిన వంటలకే ప్రాధాన్యం ఇవ్వాలి. దీని ద్వారా ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దొరికే తిండికి ఎగబడి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.