Tea And Coffee : మనలో చాలా మందికి ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగడం తప్పనిసరి అలవాటుగా ఉంటుంది. అవి లేనిదే కొంతమంది ఏ పనీ చేయలేరు. ఎంతో మందికి కాఫీ టీ లతోనే రోజు మొదలవుతుంది. కాఫీలో కెఫీన్ అనే పదార్థం ఉంటుందని మనందరికి తెలిసిందే. టీ లో కూడా కొంత మోతాదులో కెఫీన్ ఉంటుంది. అయితే కెఫీన్ ను రోజూ తీసుకోవడం వలన కొన్ని లాభాలతో పాటు సమస్యలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. కెఫీన్ అనేది మన నరాల వ్యవస్థను ప్రభావితం చేస్తుందని పరిశోధనల ద్వారా నిరూపించబడింది. కాబట్టి తరచూ కెఫీన్ ను తీసుకోవడం వలన అది శరీరానికి ఒక బలహీనతగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
అయితే ఒక్కసారిగా కాఫీ తాగడం మానేయడం వలన తలనొప్పి, అలసట, నరాలు లాగడం, నీరసం, ఒత్తిడి, చిరాకు మొదలైన సమస్యలు తలెత్తి ఏకాగ్రతను కోల్పోయే ప్రమాదం ఉంది. కెఫీన్ ను మన శరీరం త్వరగా గ్రహిస్తుంది. అందుకే కాఫీ లేదా టీ తాగినప్పుడు వెంటనే శరీరానికి శక్తి కలిగిన భావన వస్తుంది. ఒక్కసారి కెఫీన్ ను తీసుకుంటే అది కొన్ని గంటల పాటు మన శరీరంలోనే ఉంటుంది. అందు వలన నిద్రపోవడానికి ముందు కాఫీ టీ లను తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతారు.
రోజూ కాఫీ టీ లను తాగేవారు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని న్యూట్రీషనిస్టులు సూచిస్తున్నారు. వాటిలో మొదటగా, కెఫీన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ కడుపుతో తాగకూడదు. దీనికి ఉండే వేడి గుణం వలన అది మన జీర్ణాశయం ఇంకా పేగులలోని ద్రవాలను ఎండి పోయేలా చేస్తుంది. దాంతో జీర్ణాశయం ఇంకా పేగులలో పుండ్లు ఏర్పడం, ఇన్ఫెక్షన్లు మొదలైన సమస్యలు తలెత్తుతాయి. అంతే కాకుండా కాఫీ లేదా టీ లకు మంచి ఫ్యాట్ ఉండే సోయా పాలు, ఓట్స్ పాలు, ఆల్మండ్ పాలు అలాగే జంతువులను హింసించ కుండా తీసిన పాలను కలుపుకోవాలి.
పాలను టీ లేదా కాఫీ తో కలిపి మరిగించకుండా నేరుగా వేడి పాలను కలుపుకొని తాగాలి. అలా మరింగించినప్పుడు అది యాసిడిటి కి దారి తీసే అవకాశం ఉంటుంది. అలాగే టీ పొడి లేదా కాఫీ పొడి మోతదులను తగ్గించి వాటిలో దాల్చినచెక్క, యాలకులు, అల్లం, లవంగాలు, మిరియాలు లేదా అశ్వగంధ లాంటి మూలికలను కలపవచ్చు. నరాల వ్యవస్థను మెరుగుపరచడంలో ఈ మూలికలు కాఫీ టీ ల కంటే మెరుగ్గా పనిచేయడంతో పాటు వీటి వలన ఎటువంటి దుష్ప్రభావాలు కూడా దరిచేరవు. అంతిమంగా కెఫీన్ మోతాదును తగ్గించడం వలన దాని వలన రాబోయే సమస్యల నుండి కాపాడుకోవచ్చు.