Moong Dal Halva : హల్వాను ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. బొంబాయి హల్వా, బాదం హల్వా, కాజు హల్వా, క్యారెట్ హల్వా, మూంగ్ దాల్ (పెసర పప్పు) హల్వా. ఇలా ఎన్నో రకాలు చేస్తూ ఉంటారు. వీటన్నింటి లోకి పెసర పప్పు హల్వా ఎంతో ఆరోగ్యకరమైనది. రుచిగా ఉండడంతో పాటు పిల్లలకు కానీ, గర్భిణి స్త్రీలకు గానీ ఎంతో బలవర్ధకమైనది కూడా. ఇప్పుడు మనం కూడా చెక్కర వాడకుండా బెల్లంతో మూంగ్ దాల్ హల్వాను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. దీనిని ఎంతో సులువుగా మరియు త్వరగా తయారు చేసుకోవచ్చు.
మూంగ్ దాల్ హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు..
పెసర పప్పు- 200 గ్రాములు, నెయ్యి- 100 గ్రాములు, బెల్లం- 400 గ్రాములు, కొబ్బరిపాలు- 500 మి.లీ, యాలకుల పొడి- 2 టీ స్పూన్లు, జీడిపప్పులు- 10 గ్రాములు, కిస్ మిస్- 10 గ్రాములు.
మూంగ్ దాల్ హల్వాను తయారు చేసే విధానం..
ముందుగా పెసర పప్పును నెయ్యిలో దోరగా వేయించి పక్కన పెట్టాలి. అలాగే జీడిపప్పు, కిస్ మిస్ లను కూడా నెయ్యిలో వేయించి పక్కన పెట్టాలి. ఇప్పుడు బెల్లం తీసుకొని దానికి కొద్దిగా నీళ్లు కలిపి తీగపాకం వచ్చేలా ఉడికించి పక్కన పెట్టాలి. తరువాత స్టవ్ పై ఒక బాణలిలో సగం కొబ్బరి పాలు తీసుకొని దానిలో వేయించిన పెసరపప్పు వేసి ఉడికించాలి. తరువాత బెల్లం కూడా వేసి ఉడికించాలి. ఇప్పుడు మిగిలిన పాలను కూడా వేసి మంట తగ్గించుకొని మిశ్రమాన్ని గరిటెతో తిప్పుతూ అది చిక్కబడి దగ్గరగా అయ్యే దాకా ఉడికించాలి. చివరలో వేయించిన జీడిపప్పు, కిస్ మిస్ లతోపాటు యాలకులపొడి కూడా వేసి బాణలిని స్టవ్ మీద నుండి దించుకోవాలి. ఇప్పుడు ఘుమఘుమలాడే మూంగ్ దాల్ హల్వా రెడీ అయినట్లే. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.