Kakarakaya Podi : కాకరకాయలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చేదుగా ఉన్నప్పటికి కాకరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కాకరకాయలు మనకు ఎంతో దోహదపడతాయి. కాకరకాయలతో చేసిన వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కాకరకాయలతో చేసుకోదగిన వివిధ రకాల వంటకాల్లో కాకరకాయ కారం పొడి కూడా ఒకటి. కాకరకాయలతో చేసే ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. కాకరకాయలతో ఎంతో రుచిగా ఉండే కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
కాకరకాయలు – పావు కిలో, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, కారం – 3 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 10, జీలకర్ర – ఒక టీ స్పూన్, చింతపండు – 2 రెమ్మలు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కరివేపాకు – గుప్పెడు.
కాకరకాయ కారం పొడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని ఎర్రగా కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో పల్లీలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కరివేపాకు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు జార్ లో వేయించిన కాకరకాయ ముక్కలు, కారం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, జీలకర్ర, చింతపండు, వేయించిన కరివేపాకులో సగం వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కారం పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని వేయించిన పల్లీలు, మిగిలిన కరివేపాకు వేసి కలపాలి.
ఇలా తయారు చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కారం పొడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ కారం పొడిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. కాకరకాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కారం పొడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు. కాకరకాయలను ఇష్టపడని వారు కూడా ఈ కారం పొడిని మరింత కావాలని అడిగి మరీ తింటారు.