Aloe Vera For Face : మన చుట్టూ పరిసరాల్లో కలబంద మొక్క మనకు ఎక్కువగా కనిపిస్తుంది. దీని గురించి తెలియని వారు దీన్ని చూసి పిచ్చి మొక్క అనుకుంటారు. దీని ఆకుల అంచు భాగంలో ముళ్లు ఉంటాయి. దీన్ని చూసేందుకు అంతగా ఆకర్షణీయంగా కూడా ఉండదు. అందువల్ల కలబందను చాలా మంది పిచ్చి మొక్క అని భావిస్తుంటారు. అయితే ఆయుర్వేదంలో మాత్రం కలబందకు ప్రత్యేక స్థానం కల్పించారు. దీంతో అనేక ఆయుర్వేద ఔషధాలను తయారు చేస్తారు. దీన్ని ఉపయోగించి అనేక అనారోగ్య సమస్యల నుంచి మనం బయట పడవచ్చు. కలబందను ఎలా ఉపయోగిస్తే.. ఏయే అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.. దీంతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కలబంద మనకు చర్మం, జుట్టు సమస్యలనే కాకుండా ఇతర సమస్యలను తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది.
కొబ్బరినూనెలో కలబంద గుజ్జు కలిపి కాలిన పుండ్ల మీద రాస్తుంటే గాయాలు త్వరగా మానుతాయి. మోకాళ్ల నొప్పులు మరీ బాధిస్తుంటే దీనిని పైకట్టుగా దళసరిగా కడితే ఉపశమనం లభిస్తుంది. కలబందలో సల్ఫర్ ఉంటుంది. దీని గుజ్జులో యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల మానని కురుపులకు ఇది చక్కని ఔషధంలా పనిచేస్తుంది. ఎండలో బాగా తిరిగి చర్మం నల్లబడడం, ముఖంపై వివిధ రకాల మచ్చలు, చర్మం పొడిబారడం వంటి సమస్యలతో బాధపడేవారు దీనిని ప్రతి రోజూ పైపూతగా రాస్తుంటే మంచి గుణం కనిపిస్తుంది. కలబంద అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడుతుంది. పూర్వ కళను తిరిగి ముఖానికి అందిస్తుంది. దీనిలోని నీరులాంటి పదార్థం తలమీద చుండ్రు తగ్గించడానికి దోహపడుతుంది. కురులు చిట్లకుండా కాపాడుతుంది. సోరియాసిస్, చర్మంపై దురదలు ఉన్నవారు దీనిని కొబ్బరినూనెలో కలిపి రాస్తే చక్కని ఫలితం ఉంటుంది.
కంటి చుట్టూ నల్లని చారలు, నిద్రలేమి వల్ల గుంతలు ఏర్పడడం వంటివి ఈ రోజుల్లో చాలా మందిని బాధిస్తున్నాయి. ఈ సమస్యలకు కలబంద పరిష్కారం చూపిస్తుంది. దీని గుజ్జులో పాలు కలిపి నల్లని వలయాలు ఉన్న ప్రాంతంలో రాస్తుంటే క్రమేపీ అవి తగ్గుముఖం పడతాయి. దీనిని కండిషనర్‌గా స్నానం చేసిన అనంతరం ఉపయోగించవచ్చు. దంతాల చిగుళ్లు వాపులకు గురైనప్పుడు ఏం తిననివ్వకుండా బాధపెడుతున్నప్పుడు కలబందను చిగుళ్లకు రాసి వేడి నీళ్లతో పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది. కంటి ఎరుపులు, కంటి కలకలు బాధపెడుతున్నప్పుడు కలబంద గుజ్జును కడిగి అందులో 2 లేదా 3 చిటికెల పటిక వేసి తెల్లని వస్త్రంలో చుట్టి దాంతో కంటి మీద కాపడంలా అద్దితే ఉపశమనం లభిస్తుంది. అయితే కళ్లలో పడకుండా జాగ్రత్త పడాలి.
ఇక కలబంద మనకు అనేక రకాలుగా లభిస్తుంది. దీన్ని శుద్ధి చేశాకే ఉపయోగించాలి. ఇది శరీర తత్వానికి సరిపడనప్పుడు దురదలు వస్తాయి. ఈ సంకేతం అందుకుని వాడడం మానేయాలి. ఏ మోతాదులో ఎంత కాలం వినియోగించాలన్నది నిపుణుల సూచనల ప్రకారం చేయాలి. నోటి ద్వారా తీసుకునే ఔషధంగా కూడా కలబంద గుజ్జు ఉపయోగపడుతుంది. అయితే వైద్యుల సలహా మేరకు మాత్రమే దీన్ని వాడుకోవాలి. దీంతో అన్ని విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు.