మనకు అందుబాటులో అనేక రకాల పండ్లు ఉన్నాయి. కొన్ని తీపి ఎక్కువగా ఉంటాయి. కొన్ని తీపి తక్కువగా ఉంటాయి. అయితే ఆరోగ్యంగా ఉన్నవారు అన్ని రకాల పండ్లను ఇష్టంగానే తింటారు. కానీ డయాబెటిస్ ఉన్నవారు మాత్రం పండ్లను తినాలంటే ఒకింత సందేహిస్తుంటారు. ఫలానా పండు తినవచ్చా ? తింటే షుగర్ లెవల్స్ ఏమైనా పెరుగుతాయా ? అని ఆందోళన చెందుతుంటారు. అయితే గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లను డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చు. ఎలాంటి భయం చెందాల్సిన పనిలేదు.
గ్లైసీమిక్ ఇండెక్స్.. దీన్నే జీఐ అని కూడా పిలుస్తారు. మనం తీసుకునే ఆహారంలో ఉండే పిండి పదార్థాలు (కార్బొహైడ్రేట్లు) శరీరంలో గ్లూకోజ్ గా మారుతాయి. పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే పదార్థాలను తింటే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా చేరుతుంది. దీంతో షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. అదే పిండి పదార్థాలు తక్కువగా ఉండే పదార్థాలను తింటే రక్తంలో షుగర్ లెవల్స్ అంత త్వరగా పెరగవు. ఇలా మనం తినే పదార్థాలను బట్టి రక్తంలో షుగర్ లెవల్స్ ఏ మేర పెరుగుతాయో చెప్పే కొలమానాన్నే గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు. అంటే జీఐ విలువ ఎక్కువగా ఉండే పదార్థాలను తింటే రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. కనుక ఈ పదార్థాలను డయాబెటిస్ ఉన్నవారు అస్సలు తినరాదన్నమాట. ఇక జీఐ విలువ మధ్యస్థంగా ఉండే పదార్థాలు కూడా ఉంటాయి. వీటిని తిన్నాక రక్తంలో షుగర్ లెవల్స్ కొంత మేర పెరుగుతాయి. కానీ అంత ఎక్కువగా ఉండవు. కనుక ఈ పదార్థాలను ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు. ఇక జీఐ విలువ తక్కువగా ఉండే పదార్థాలను తింటే రక్తంలో షుగర్ లెవల్స్ అంత త్వరగా పెరగవు. చాలా సమయం పడుతుంది. ఇలాంటి పదార్థాలను డయాబెటిస్ ఉన్నవారు రోజూ తీసుకోవాలి.
ఇక మనకు లభించే అనేక పదార్థాలు, పండ్లు, కూరగాయలకు జీఐ విలువలు మారుతుంటాయి. చక్కెర, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే పదార్థాల జీఐ విలువ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కూరగాయలు, పండ్ల జీఐ విలువలు మధ్యస్థంగా, తక్కువగా ఉంటాయి. అందుకనే డయాబెటిస్ ఉన్నవారిని కూరగాయలు, పండ్లు తరచూ తినమని చెబుతుంటారు.
ఇక జీఐ విలువ తక్కువగా ఉండే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. దానిమ్మ పండ్లలో కార్బొహైడ్రేట్లు, చక్కెరలు ఉంటాయి. కానీ ఈ పండ్ల జీఐ విలువ కేవలం 18 మాత్రమే. అంటే ఈ పండ్లను తింటే రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరగవు. చాలా నెమ్మదిగా పెరుగుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు దానిమ్మ పండ్లను భేషుగ్గా తినవచ్చు. వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వీటిని తినడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ నశిస్తాయి. షుగర్ అదుపులో ఉంటుంది. ఈ పండ్లలో పీచు అధికంగా ఉంటుంది కనుక జీర్ణక్రియ మెరుగు పడుతుంది.
2. రోజుకో యాపిల్ పండును తింటే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని చెబుతుంటారు. ఆ మాట అక్షరాలా నిజం. ఎందుకంటే దాదాపుగా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికైనా యాపిల్ పండ్లు మేలే చేస్తాయి. ఇక డయాబెటిస్ ఉన్నవారికి ఈ పండ్లు వరమనే చెప్పవచ్చు. ఈ పండ్లలో విటమిన్ సి, పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ పండ్లలో ఉండే పీచు, పాలిఫినాల్స్ కార్బొహైడ్రేట్ల శోషణను తగ్గిస్తాయి. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరగవు. యాపిల్ పండ్లలో చక్కెర ఉంటుంది. కానీ అది ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ పై పెద్దగా ప్రభావం చూపదు. పైగా యాపిల్ పండ్లను తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. దీంతో చక్కెర స్థాయిలు పెరగవు. యాపిల్ పండ్ల గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ 36 మాత్రమే. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను కూడా నిరభ్యంతరంగా తినవచ్చు.
3. స్ట్రాబెర్రీలలో పీచు ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరగవు. ఈ పండ్లను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీవక్రియలు మెరుగు పడతాయి. క్యాన్సర్‌తో పోరాడే శక్తి లభిస్తుంది. బరువును తగ్గించడంలో ఈ పండ్లు సహాయ పడతాయి. వీటి జీఐ విలువ 46. కనుక వీటిని భేషుగ్గా తినవచ్చు.
4. రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో జామకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ పండ్లలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది చక్కెర శోషణను నియంత్రిస్తుంది. దీంతో చక్కెర స్థాయిలు పెరగవు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను రోజూ తింటే మంచిది. జామ పండ్ల జీఐ విలువ అతి తక్కువ. కేవలం 12 మాత్రమే. కనుక ఈ పండ్లను డయాబెటిస్ ఉన్నవారు రోజూ తినవచ్చు. ఈ పండ్లలో విటమిన్ ఎ, సి, పలు రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి.
5. ద్రాక్ష పండ్ల జీఐ విలువ 53-59 మధ్య ఉంటుంది. ఇది మధ్యస్థ గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ. కానీ ద్రాక్ష పండ్లను తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఈ పండ్లలో విటమిన్ సి, రెస్వెరాట్రోల్ అనే సమ్మేళనం ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌ను శరీరం గ్రహించేలా చేస్తాయి. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. రక్తంలో చక్కెర నిల్వ అవకుండా చూస్తాయి. ద్రాక్ష పండ్లను కూడా డయాబెటిస్ ఉన్నవారు తరచూ తింటుండాలి.
6. బత్తాయి పండ్లలో విటమిన్ సి, పీచు, ఫోలేట్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఈ పండ్ల జీఐ విలువ 40 వరకు ఉంటుంది. అందువల్ల వీటిని డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి భయం చెందకుండా తినవచ్చు. బత్తాయి పండ్లను తినడం వల్ల శరీరానికి మేలే జరుగుతుంది.
7. మధుమేహంతో బాధపడేవారు తినాల్సిన పండ్లలో బొప్పాయి ఒకటి. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు అధికంగా ఉంటాయి. ఈ పండ్ల గ్లైసెమిక్ ఇండెక్స్ మధ్యస్థంగా ఉంటుంది. కనుక వీటిని అప్పుడప్పుడు తినవచ్చు. బొప్పాయి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. కనుక వీటిని తరచూ తింటే మంచిది.
ఇక ఇవే కాకుండా నేరేడు, అంజీర్, కివీ పండ్లను కూడా డయాబెటిస్ ఉన్నవారు తినవచ్చు. ఇవి తక్కువ జీఐ విలువను కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ తినవచ్చు.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365