Kidneys : మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఒకటి. మూత్రపిండాలు మన శరీరంలో ఉండే రక్తాన్ని గంటకు రెండు సార్లు వడకడతాయి. ఇవి రక్తంలో ఉండే మలినాలను, విష పదార్థాలను, హానికలిగించే టాక్సిన్లను వడకట్టి మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. మూత్రపిండాలు చక్కగా పని చేసినప్పుడు వాటి ఆరోగ్యంపై ఎవరు శ్రద్ద చూపించరు. మూత్రపిండాలు పాడైన తరువాత అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాటిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. కనుక మూత్రపిండాల ఆరోగ్యంపై కూడా మన తగినంత శ్రద్ద తీసుకోవాలి. మూత్రపిండాలు పాడవకుండా తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి.
అయితే మూత్రపిండాలు పాడవడానికి గలకారణాలను తెలుసుకోవడం వల్ల మనం వాటిని పాడవకుండా కాపాడుకోవచ్చు. మూత్రపిండాలు పాడవడానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉంటాయి. మూత్రపిండాలు పాడవడానికి గల కారణాలల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. నేటి తరుణంలో 40 శాతం మంది షుగర్ వ్యాధి గ్రస్తులు మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కనుక షుగర్ వ్యాధి గ్రస్తుల మూత్రపిండాల ఆరోగ్యంపై మరింత శ్రద్ద చూపించాలి. అలాగే అధిక రక్తపోటు వల్ల కూడా మూత్రపిండాలు దెబ్బతింటాయి.
రక్తపోటు వల్ల మూత్రపిండాలకు రక్తప్రసరణ సాఫీగా సాగదు. దీంతో మూత్రపిండాలు దెబ్బతింటాయి. అలాగే కొన్ని రకాల వైరస్, బ్యాక్టీరియాల ఇన్పెక్షన్ కారణంగా మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. కనుక షుగర్, బీపీ సమస్యలతో బాధపడే వారు అలాగే ఎటువంటి సమస్య లేకపోయినప్పటికి ఆరోగ్యంపై శ్రద్ద చూపించేవారు సంవత్సరానికి ఒకసారి మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. యూరిన్ ఆల్బుమిన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్( క్రియాటిన్ టెస్ట్), ఇఎఫ్ఆర్( గోమ్యులర్ ఫిల్ట్రేషన్ రేట్) వంటి టెస్ట్ లను చేయించుకోవాలి.
డాక్టర్ ను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మూత్రపిండాలు వైఫల్యం చెందకుండా ఉండాలంటే షుగర్, బీపీ వంటి సమస్యలు అదుపులో ఉండేలా చూసుకోవాలి. అలాగే ఉప్పును తక్కువగా తీసుకోవాలి. బరువు అదుపులో ఉండేలా చూసుకోవాలి. ధూమపానం, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. రోజూ తగినంత నిద్రపోవాలి. ఒత్తిడి, ఆందోళన వంటివి దరి చేరకుండా చూసుకోవాలి. కూరగాయలు, పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మూత్రపిండాలు పాడవకుండా వాటి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.