Hyderabad Stye Puri Curry : మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో పూరీలు కూడా ఒకటి. పూరీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ పూరీలను తినడానికి చట్నీ, సాంబార్ తో పాటు మనం పూరీ కర్రీని కూడా తయారు చేస్తూ ఉంటాము. పూరీ కర్రీతో తింటే పూరీలు మరింత రుచిగా ఉంటాయి. ఈ పూరీ కర్రీని ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే పూరీ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. హైదరాబాద్ స్టైల్ లో చేసే ఈ పూరీ కర్రీని తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే హైదరాబాద్ స్టైల్ పూరీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూరీ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ముప్పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, కారం ఉన్న పచ్చిమిర్చి – 2, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – పావుకిలో, నీళ్లు – 500 ఎమ్ ఎల్, ఉప్పు – తగినంత, శనగపిండి – 2 టీ స్పూన్స్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంప – పెద్ద నిమ్మకాయంత ఉన్నది, నిమ్మరసం – ఒక టీ స్పూన్.
పూరీ కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసి వేయించాలి. తరువాత శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయలు వేసి 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఉప్పు, నీళ్లు పోసి కలపాలి. వీటిపై మూత పెట్టి ఉల్లిపాయలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత ఒక గిన్నెలో శనగపిండి తీసుకుని అందులో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఉడికిన తరువాత శనగపిండి మిశ్రమం వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు ఉడికించిన తరువాత ఉడికించిన బంగాళాదుంపను మెత్తగా చేసి వేసి అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత నిమ్మరసం వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పూరీ కర్రీ తయారవుతుంది. దీనిని పూరీలతో తింటే చాలా రుచిగా ఉంటుంది.