Balakrishna : ఎన్టీఆర్ నట వారసుడిగా బాలకృష్ణ వెండితెరకు పరిచయమై తన అద్భుతమైన నటనతో ఎన్నో చిత్రాలతో ఘనవిజయం అందుకున్నారు. బాలయ్య బాబుకి అభిమానుల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదేవిధంగా నిర్మాత డి.రామానాయుడు సినీ వారసుడిగా కలియుగ పాండవులు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు విక్టరీ వెంకటేష్. వెంకటేష్ అద్భుతమైన నటనతో తనకంటూ ఒక సపరేట్ ట్రెండ్ ను సెట్ చేసుకున్నారు.
అయితే టాలీవుడ్ తోపాటు వివిధ సినీ పరిశ్రమలలో సంక్రాంతి, సమ్మర్ స్పెషల్ అంటూ టాప్ హీరోల సినిమాలు థియేటర్ల వద్ద పోటీ పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా సమ్మర్ స్పెషల్ గా ఒకే రకమైన స్టోరీ లైన్‌లో ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో దిగిన బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలేవో తెలుసా.. బాలకృష్ణ హీరోగా నటించిన అశోక చక్రవర్తి మరియు వెంకటేష్ హీరోగా నటించిన ధ్రువ నక్షత్రం ఒకే రోజు దగ్గర దగ్గరగా ఒకే కథాంశంతో ప్రేక్షకులను అలరించడం కోసం థియేటర్ లోకి వచ్చేశాయి.
మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ఆర్యన్ సినిమాకు రీమేక్ గా బాలకృష్ణ నటించిన అశోక చక్రవర్తి చిత్రాన్ని తీయడం జరిగింది. ఈ సినిమాకు ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వం వహించారు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కిన ఈ సినిమా 1989 జూన్ 29న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో బాలకృష్ణకు జంటగా భానుప్రియ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి గాను ఇళయరాజా సంగీతం అందించారు. అంతేకాదు ఈ సినిమాలో పాటలు అప్పట్లో మ్యూజికల్‌గా హిట్ అయ్యాయి.
ఇక మరోవైపు వెంకటేష్ హీరోగా ధ్రువనక్షత్రం కూడా దాదాపు మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రమే. ఈ చిత్రానికి వై.నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా దాదాపు మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న ఆర్యన్ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. వెంకటేష్ ధ్రువ నక్షత్రం చిత్రం కూడా 1989 జూన్ 29న థియేటర్లలో విడుదలైంది. ధ్రువ నక్షత్రం చిత్రంలో వెంకటేష్ సరసన రజినీ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు. ఈ రెండు చిత్రాలకు ఉన్న మరొక విశేషం ఏంటంటే.. మాటల రచయితలుగా పరుచూరి బ్రదర్స్ పనిచేయటం.
మొత్తంగా ఒక తరహా కథతో వచ్చిన ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం, వాటికి మాటలు రాసిన రచయతలు కూడా ఒకరే కావడం మరో విచిత్రమనే చెప్పాలి. సమ్మర్ స్పెషల్ గా బాక్సాఫీస్ బరిలో దిగిన ఇద్దరి సినిమాలలో వెంకటేష్ నటించిన ధృవనక్షత్రం సినిమా సూపర్ హిట్ ను అందుకోగా, బాలకృష్ణ నటించిన అశోక చక్రవర్తి బాక్సాఫీస్ బరిలో యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది.