Krishnam Raju : రెబల్‌స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీకి సంబంధించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం.. కృష్ణంరాజు 1940 జనవరి 20న పశ్చిమ గోదావరిలోని మోగల్తూరులో జన్మించారు. ఆయన అసలు పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. సినిమాల్లోకి వచ్చాక సింపుల్‌గా కృష్ణంరాజుగా పిలిపించుకున్నారు.
సినిమాల్లోకి రాకముందు ఆయన ఆంధ్రరత్న పత్రికలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట విలన్‌గా కొన్ని సినిమాలు చేశారు. 1966లో చిలకా గోరింక అనే చిత్రంతో హీరోగా మారారు. దాదాపు 200 సినిమాల్లో నటించారు. రాజకీయంగానూ రాణించారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆయన ఫ్యామిలీ విషయాలు చూస్తే.. కృష్ణంరాజు 2 పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట ఆయనకు సీతాదేవితో వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. ఓ కూతురుని దత్తత తీసుకున్నారు. 1995లో సీతాదేవి కారు ప్రమాదంలో కన్నుమూసింది. ఏడాది తర్వాత 1996 సెప్టెంబర్ 20న శ్యామలాదేవితో రెండో వివాహం జరిపించారు.
వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. ఇలా మొత్తం కృష్ణంరాజుకి 4 కుమార్తెలు అని చెప్పొచ్చు. పెద్ద కూతురు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి, దత్తత తీసుకున్న మరో కూతురు ప్రశాంతి ఉన్నారు. అందరి పేర్లు ప అక్షరం మీదనే ఉండటం విశేషం. ప్రభాస్, ప్రమోద్ కూడా ప అక్షరంతోనే ఉన్నాయి. కృష్ణంరాజు పెద్ద కుమార్తె (శ్యామలాదేవి మొదటి కూతురు) ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తుంది. కృష్ణంరాజు గోపీకృష్ణ మూవీస్ అనే నిర్మాణ సంస్థని స్థాపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ బాధ్యతలను ప్రసీదకి అప్పగించారు.ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రానికి ప్రసీద ఓ నిర్మాతగా వ్యవహరించారు.
కృష్ణంరాజుకు సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు ఉన్నారు. ఆయన కుమారుడే ప్రభాస్ అని తెలిసిందే. సూర్యనారాయణరాజు అన్న స్థాపించిన గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌పైనే అనేక సినిమాలు నిర్మించారు. భక్తకన్నప్ప, మన వూరి పాండవులు, తాండ్ర పాపారాయుడు, బిల్లా మొదలైన చిత్రాలను నిర్మించారు. సూర్యనారాయణ రాజుకి ఇద్దరు సంతానం. వీరిలో ప్రభాస్ పెద్దవాడు కాగా, సిద్ధార్థ్ రాజ్ కుమార్ చిన్నవాడు. ఆయన కెరటం మూవీలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. నిర్మాత ప్రమోద్ వారి బంధువుల అబ్బాయి. ప్రమోద్ యూవీ క్రియేషన్స్ స్థాపించి నిర్మాతగా రాణిస్తున్నారు. దీని వెనకాల ప్రభాస్ ఉన్నాడనే విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా, పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.