Hair Growth : ప్రతి ఒక్కరూ తమ జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా, మృదువుగా ఉండాలని కోరుకుంటారు. దీని కోసం మార్కెట్లో లభించే రకరకాల రసాయనాలతో కూడిన షాంపులు మరియు నూనెలు వాడుతూ లేనిపోని కొత్త సమస్యలను కొనితెచ్చుకుంటారు. దీనివల్ల జుట్టుకు మేలు కన్న ఎక్కువగా హాని జరుగుతుంది. అలా కాకుండా ఇంటిలోనే దొరికే పదార్థాలతో నివారణలను ప్రయత్నిస్తే ఎటువంటి హాని లేకుండా మంచి ఫలితం కనిపిస్తుంది.
వాతావరణంలో మార్పుల వల్ల ఒక్కోసారి జుట్టు అంచు చివర్లు చిట్లడం వంటివి మనం గమనిస్తుంటాము. దీనికోసం బాగా మాగిన అరటిపండ్లు ఎంతో ఉపయోగపడతాయి. రెండు మాగిన అరటిపండ్లను తీసుకొని గుజ్జులా చేసుకోవాలి. అందులో రెండు గుడ్లసొన, ఒక నిమ్మకాయ రసం, విటమిన్ ఇ ఆయిల్ కూడా అందులో కలిపి జుట్టికి బాగా పట్టించాలి. ఈ ప్యాక్ క్రింద పడకుండా, షవర్ క్యాప్ ధరించాలి. గంటతర్వాత క్యాప్ తీసి కాసేపు జుట్టుని నెమ్మదిగా మర్దన చేయాలి.. ఆ తరువాత గోరువెచ్చని నీటితో మైల్డ్ షాంపూ తలస్నానం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు చేస్తే, జుట్టు నిగనిగలాడటంతో పాటు చివర్లు చిట్లడం ఆగుతుంది.
అదేవిధంగా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలి అంటే ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. దానికోసం రెండు టీ స్పూన్ చొప్పున మెంతులు, పెసలు ముందురోజే నానబెట్టేసుకోవాలి. మర్నాడు ఈ రెండింటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ లో ఒక గుడ్డుసొన, రెండు టీ స్పూన్స్ శీకాకాయపొడిని కలిపి తలకు షాంపూ మాదిరిగా రాసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చెయ్యటం వలన ఒత్తయిన మృదువైన జుట్టు మీ సొంతమవుతుంది. అంతేకాకుండా చుండ్రు దురద వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.
ప్రస్తుతం వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం వల్ల జుట్టు పొడిబారి పోయినట్లు తయారవుతుంది. అలాంటి వారి కోసం ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక కప్పు పెరుగులో కొద్దిగా నిమ్మరసం, ఒక గుడ్డుసొన బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించుకుని గంట వరకు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కుంకుడు కాయ లేక శీకాకాయ పొడితో తలస్నానం చేయాలి. ఈ చిట్కాలను ఉపయోగించడం ద్వారా జుట్టు చిట్లటం ఆగిపోయి మృదువైన పట్టులాంటి సిల్కీ హెయిర్ మీ సొంతమవుతుంది.