పురుషులు, ఏదో ఒక కారణంగా, రాత్రిపూట తరచుగా నిద్రనుండి లేస్తారు. దాంతో మరల నిద్రపోవాలంటే వారికి గాఢ నిద్ర రాదు. ఈ కారణంగా వారు అధిక రక్తపోటు, దానితో పాటు గుండెపోటుకు గురయ్యేఅవకాశాలున్నాయరి హార్వర్డు యూనివర్శిటీ పరిశోధకులు ఒక పరిశోధనలో వెల్లడి చేసినట్లు ది డైలీ మెయిల్ పత్రిక ప్రచురించింది.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించబడిన ఈ స్టడీ లో 65 ఏళ్ళ వయసు పైబడిన 784 మంది పురుషుల నిద్రపోయే అలవా ట్లను పరిశీలించారు. వివిధ దశలలో రీసెర్చర్లు వారి నిద్ర తీవ్రతలను కొలిచారు. ఎంత తరచుగా వారు నిద్రనుండి లేస్తున్నారనేది పరిశీలించారు. 80 శాతంమంది పురుషులకు గాఢ నిద్ర లేదని వీరు అధిక రక్తపోటుకు గురవుతున్నారని తేల్చారు.
సగటు వ్యక్తి గాఢనిద్ర 15 శాతం అనుకుంటే వీరి గాఢ నిద్ర 4 శాతం మాత్రమేనని తెలిపారు. వీరి గాఢ నిద్ర లేని కారణం శ్వాస సంబంధిత సమస్యలు, గట్టిగా గురక పెట్టి లేచిపోవటమని తెలిపారు. ఈ రకంగా గాఢనిద్ర కరువైన పురుషులు అధికంగా రక్తపోటుకు గురై గుండె సంబంధిత సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారని పరిశోధన తెలిపింది.