మన చుట్టూ ఉండే ప్రకృతిలో రకరకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. కానీ మనమే వాటిని పట్టించుకోము. వాటిల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయన్న సంగతి చాలా మందికి తెలియదు. అలాంటి మొక్కల్లో గడ్డి చామంతి మొక్క ఒకటి. దీన్నే నల్లాలం మొక్క అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం ట్రైడాక్స్ ప్రొక్యుమ్‌బెన్స్. మెక్సికన్ డైసీ, కోట్ బట్టన్స్ అని, సంస్కృతంలో దీన్ని జయంతి వేద మొక్క అని కూడా పిలుస్తారు. ఆయుర్వేద ప్రకారం ఈ మొక్క ఎన్నో వ్యాధులను నయం చేస్తుంది.
గడ్డి చామంతి మొక్క ఎక్కువగా మన ఇంటి పరిసరాల్లోనే కనిపిస్తుంది. పంట పొలాల్లో గట్ల మీద కూడా పెరుగుతుంది. దీని ఆకులలో ఔషధ గుణాలు ఉంటాయి. అవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. గడ్డి చామంతి ఆకులను తీసుకుని నలిపి పుండ్లు, గాయాలు, దెబ్బలు, వాపుల మీద వేసి కట్టులా కడుతుంటే అవి త్వరగా మానుతాయి.
షుగర్ లెవల్స్ ను తగ్గించడంలోనూ గడ్డి చామంతి ఆకులు బాగా పనిచేస్తాయి. ఈ ఆకుల్లో ఉండే జేర్యలోనిక్ అనే రసాయనం షుగర్‌కు బాగా పనిచేస్తుందని తేలింది. అందువల్ల ఈ ఆకుల రసాన్ని రోజూ ఉదయం పరగడుపునే అర టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గిపోతాయి.
నీటిలో ఉండే ఫ్లోరైడ్ వల్ల చాలా మంది అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఆ నీటిలో గడ్డి చామంతి ఆకులను వేస్తే ఫ్లోరైడ్ నశిస్తుంది. దీంతో ఆ నీరు శుభ్రంగా మారుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
గడ్డి చామంతి ఆకులను ఉపయోగించి తెల్లని వెంట్రుకలను నల్లగా మార్చుకోవచ్చు. అందుకు గాను ఓ నూనెను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. గడ్డి చామంతి ఆకులు, గుంటగలగర ఆకులు, నల్ల నువ్వుల నూనెలను తీసుకోవాలి. గడ్డి చామంతి ఆకుల నుంచి రసం తీయాలి. అలాగే గుంటగలగర ఆకుల నుంచి కూడా రసం తీయాలి. ఈ రెండు ఆకుల రసాలను నువ్వుల నూనెలో కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని సన్నని మంటపై మరిగించాలి. ఈ క్రమంలో నూనె మాత్రమే మిగిలే వరకు ఆ మిశ్రమాన్ని మరిగించాలి. తరువాత ఆ నూనెను తీసి పక్కన పెట్టాలి.
ఇలా తయారు చేసిన నూనెను చల్లారిన తరువాత కొద్దిగా తీసుకుని జుట్టుకు కుదుళ్లకు బాగా తగిలేలా పట్టించాలి. రాత్రి ఈ నూనెను రాసి ఉదయం తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయాలి. దీంతో తెల్ల జుట్టు నల్లగా మారుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఇతర జుట్టు సమస్యలు కూడా పోతాయి. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.
గడ్డి చామంతి ఆకులతో దోమలను తరిమేయవచ్చు. ఈ మొక్క ఆకులను నీడలో ఎండబెట్టాలి. అనంతరం వాటిని ఇంట్లో మండించి పొగబెట్టాలి. దీంతో ఆ పొగకు దోమలు దూరంగా పోతాయి. ఈ విధంగా దోమలను తరిమేయవచ్చు.
అన్ని రకాల చర్మ వ్యాధులకు ఈ మొక్క ఆకులు బాగా పనిచేస్తాయి. వీటి ఆకుల రసాన్ని రాస్తే తామర, గజ్జి, బొబ్బలు తగ్గిపోతాయి.
ఈ మొక్క ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. హైబీపీ కూడా తగ్గుతుంది.
గమనిక : ఈ మొక్కను ఉపయోగించాలనుకునే వారు ముందుగా ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం మంచిది.