మన శరీరానికి నిత్యం అనేక రకాల పోషకాలు అవసరం అవుతాయన్న సంగతి తెలిసిందే. వాటిల్లో ఐరన్ కూడా ఒకటి. దీన్నే ఇనుము అంటారు. మన శరీరంలో ఎర్ర రక్త కణాల తయారీకి, రక్తం ఉత్పత్తి అయ్యేందుకు ఐరన్ ఎంతగానో అవసరం అవుతుంది. అందువల్ల ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను మనం నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది.
ఐరన్ లోపం ఏర్పడేందుకు కారణాలు
ఐరన్ లోపం మనకు రకరకాల కారణాల వల్ల ఏర్పడుతుంటుంది. ముఖ్యంగా స్త్రీలలో ఐరన్ లోపం సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఐరన్ ఉన్న ఆహారాలను సరిగ్గా తీసుకోకపోవడం, గర్భం ధరించడం, నెలసరి సమయంలో తీవ్రంగా రక్తస్రావం అవడం, అంతర్గత రక్తస్రావం, శరీరం ఐరన్‌ను శోషించుకోలేకపోవడం, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలు ఉండడం వంటి అనేక కారణాల వల్ల మహిళల్లో రక్త హీనత సమస్య వస్తుంది. ఇక ఇతరుల్లో సాధారణంగా ఐరన్ ఉన్న ఆహారాలను తినకపోవడం వల్లే ఐరన్ లోపం సమస్య వస్తుంటుంది.
ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు
- ఐరన్ లోపం ఉంటే రక్తహీనత వస్తుంది. దీంతో చర్మం పాలిపోయినట్లు తెల్లగా కనిపిస్తుంది.
- తీవ్రమైన అలసట కలుగుతుంది.
- శ్వాసతీసుకోడం కష్టంగా అనిపిస్తుంది.
- తలనొప్పి వస్తుంది.
- చర్మం పొడిబారుతుంది. వెంట్రుకలు చిట్లినట్లు అవుతాయి.
- నీరసంగా ఉంటుంది. ఛాతిలో నొప్పిగా అనిపిస్తుంది.
- తలతిరగడం, చేతులు, కాళ్లు చల్లగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- నాలుక వాపునకు గురై పగిలినట్లు కనిపిస్తుంది.
పైన తెలిపిన లక్షణాలు ఉంటే వాటిని ఐరన్ లోపం వల్ల వచ్చినవేమోనని అనుమానించాలి. డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఐరన్ తక్కువగా ఉంటే రక్తం తక్కువగా ఉంటుంది కనుక రక్త పరీక్షలో ఆ విషయం తెలిసిపోతుంది. దీంతో డాక్టర్ సూచన మేరకు మందులను వాడడంతోపాటు కింద తెలిపిన ఆహారాలను నిత్యం తీసుకోవాలి. దీంతో ఐరన్ లోపం సమస్య నుంచి బయట పడవచ్చు.
ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఇవే
టమాటాలు, యాపిల్స్, కోడిగుడ్లు, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, రాజ్మా, క్యారెట్, పాలు, పాలకూర, బ్రొకొలి, చేపలు, మటన్, చికెన్, నట్స్ వంటి పదార్థాల్లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. వీటిని తరచూ తీసుకుంటే ఐరన్ లోపం సమస్యను అధిగమించవచ్చు. అయితే డాక్టర్ల సలహా మేరకు ఐరన్ ట్యాబ్లెట్లు వాడినా ఐరన్ లోపం సమస్య తగ్గుతుంది. దీంతో రక్త కణాలు బాగా ఉత్పత్తి అవుతాయి. రక్తం ఎక్కువగా తయారవుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365