పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న 9 ప్రధాన ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ దాడులు చేసి వారి శిబిరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. పహల్‌గామ్ జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు ఇండియన్ ఆర్మీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. మే 7వ తేదీన రాత్రి 2 నుంచి 3 గంటల మధ్యన ఈ దాడులను అత్యంత కచ్చితత్వంతో నిర్వహించారు. తెల్లవారుజామున జరిగిన ఈ దాడులతో పాకిస్థాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయితే భారత దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ వెల్లడించినప్పటికీ వారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని భారత రిటైర్డ్ ఆర్మీ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక ఈ ఆపరేషన్‌కు గాను ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు.
ఈ ఆపరేషన్‌కు గాను ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు నామకరణం చేశారంటే.. పహల్‌గామ్‌లో పలువురు నవ వధువులకు చెందిన భర్తలను వారి కళ్ల ముందు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు. వారి నుదుటన ఉన్న సింధూరాన్ని టెర్రరిస్టులు తుడిచివేశారు. అయితే అందుకు ప్రతీకారం తీర్చుకున్నామని సింబాలిక్‌గా చెప్పడం కోసమే ప్రధాని మోదీ స్వయంగా ఈ ఆపరేషన్‌కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై దాడులపై ఇతర దేశాలకు భారత్ స్వయంగా వివరించింది. తాము కేవలం ఉగ్ర శిబిరాలపై మాత్రమే దాడులు చేశామని తెలిపారు. ఈ దాడుల్లో ప్రధాన ఉగ్రవాద సంస్థలకు చెందిన శిబిరాలు, ఆయుధ సామగ్రి భారీగా ధ్వంసం అవడమే కాకుండా సుమారుగా 100 మంది టెర్రరిస్టులు హతమైనట్లు జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.
బుధవారం దేశవ్యాప్తంగా పలు చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించనుండడంతో తాజా దాడులు అందరినీ షాకింగ్‌కు గురి చేశాయి. భారత్ నుంచి ఈ ప్రతిఘటన వస్తుందని పాక్ సైతం ఊహించి ఉండదని నిపుణులు అంటున్నారు. భారత్ మొత్తం 24 క్షిపణులను, పలు డ్రోన్లను ఈ దాడులకు ఉపయోగించిందని సమాచారం. అయితే వీటిని పాకిస్థాన్ రాడార్ వ్యవస్థ ఏమాత్రం పసిగట్టలేకపోయిందని, అక్కడే పాక్ ఆర్మీ వైఫల్యం ఏమిటో పూర్తిగా స్పష్టమైందని తెలుస్తోంది. ఇక ఈ సంఘటనపై పాక్ ఎలా స్పందిస్తున్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.