Viagra : కరోనా సోకిన వారికి భిన్న రకాల మందులను ఇచ్చి వైద్యులు నయం చేస్తున్న సంగతి తెలిసిందే. కాలానుగుణంగా రకరకాల మందులను, విధానాలను కోవిడ్ చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రకాల మందులతోపాటు పలు విధానాలను పాటిస్తూ అనేక మందిని వైద్యులు ప్రాణాపాయం నుంచి రక్షించారు. అయితే ఆ దేశంలో ఓ మహిళను డాక్టర్లు అనూహ్యమైన రీతిలో కాపాడారు. ఆమెకు కోవిడ్ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. నిపుణుల సూచన మేరకు ఆమెకు వయాగ్రాతో చికిత్స అందించారు. దీంతో ఆమె కేవలం 2 రోజుల్లోనే కోలుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇంగ్లండ్‌లోని లింకన్‌షైర్ ప్రాంతం గెయిన్స్ బొరొ లో నివాసం ఉండే మోనికా అల్‌మెయిదా (37) స్థానిక ఎన్‌హెచ్ఎస్ లింకన్‌షైర్ హాస్పిటల్‌లో హెల్త్ కేర్ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఈమె ఆ హాస్పిటల్‌లో కోవిడ్ రోగులకు సేవలు అందిస్తోంది. అయితే ఇంగ్లండ్‌లో కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మోనికాకు కూడా కోవిడ్ సోకింది. ఈమె గత అక్టోబర్ నెలలో కోవిడ్ బారిన పడింది. దీంతో లింకన్ కౌంటీ హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకుంది.
అయితే ఆమె కోలుకోవడంతో అంతా బాగానే ఉందని డిశ్చార్జి చేశారు. కానీ ఇంటికి వచ్చాక కొద్ది రోజులకు ఆమెకు శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఆమె మళ్లీ హాస్పిటల్‌లో చేరింది. ఈ క్రమంలోనే ఆమె హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ నవంబర్ 16న కోమాలోకి వెళ్లిపోయింది.
అయితే ఆమె కోమాలోకి వెళ్లే ముందే అత్యవసర చికిత్స కోసం ఏ మెడిసిన్ అయినా.. వైద్య విధానాన్ని అయినా వాడమని చెప్పి తన అనుమతిని తెలియజేస్తూ ఫామ్ ఇచ్చింది. దీంతో వైద్యులు ఆమె స్నేహితుల సూచనతో ఆమెకు వయాగ్రా మెడిసిన్‌ను భారీ డోసులుగా ఇచ్చారు. దీంతో ఆమెకు స్పృహ వచ్చింది. వయాగ్రా మందులను వాడిన తరువాత 48 గంటల్లోనే ఆమె కోమా నుంచి బయటకు వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
మోనికా కోమాలోకి వెళ్లకముందు ఆమెకు దగ్గులో రక్తం పడింది. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అయితే వయాగ్రా మందులను ఇచ్చాక ఆమె 48 గంటల్లో కోలుకుని తిరిగి ఆరోగ్యవంతురాలు అయింది. ఆమెకు ప్రస్తుతం శ్వాస బాగానే ఆడుతుందని.. పరిస్థితి బాగానే ఉందని.. త్వరలో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.
కోమాలో ఉన్న కోవిడ్ పేషెంట్లకు వయాగ్రా ఇస్తే సత్ఫలితాలు వస్తాయని గతంలోనే నిపుణులు వెల్లడించారు. అయితే దీన్ని చాలా మంది అమలు చేయలేదు. కానీ ఆ డాక్టర్లు అమలు చేసి విజయం సాధించారు. సాధారణంగా అంగస్తంభన, శృంగార సమస్యలు ఉన్న పురుషులు వయాగ్రా వాడుతుంటారు. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. జననావయవాలకు రక్త సరఫరా మెరుగు పడి ఆ అవయవాలు పటిష్టంగా మారుతాయి. దీంతో పురుషుల్లో అంగస్తంభన సమస్య ఉండదు. శృంగారంలోనూ చురుగ్గా పాల్గొంటారు.
అయితే వయాగ్రా మందులు రక్త సరఫరాను మెరుగు పరచడంతోపాటు ఊపిరితిత్తుల్లోని రక్త నాళాలను శాంత పరుస్తాయి. అవి వెడల్పుగా మారేలా చేస్తాయి. దీంతో శ్వాస సరిగ్గా ఆడుతుంది. వాయు మార్గాలు కూడా క్లియర్ అవుతాయి. కోవిడ్ పేషెంట్లలో ఇదే సమస్య ప్రధానం కనుక.. వయాగ్రాను వాడితే ఈ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు తెలిపారు. ఈ క్రమంలోనే ఇదే సూత్రంతో మోనికాకు వైద్యులు వయాగ్రాతో చికిత్సను అందించి విజయం సాధించారు. అయితే ఇలాంటి చికిత్సను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలోనే అందించాలని సైంటిస్టులు చెబుతున్నారు.