సావిత్రి అంతగా ఏమీ చదువుకోలేదు. ఏదో తనకు ఉన్న జ్ఞానంతో మద్రాసు చేరుకున్నారు. అక్కడ వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొంటూ ఎదగాల్సిన సరైన సమయంలో వయసు తొందరలో తప్పుడు నిర్ణయం తీసుకుని ఎంత మంది చెప్పినా లక్ష్యం చేయకుండా జెమినికి తనజీవితాన్ని అప్పగించి మందలించిన చౌదరిని దూరం చేసుకొని మంచి చెప్పేవారికి దూరంగా జరిగి పోయారు. ఒకసారి ఆ మోసగాడి గురించి తెలిసిపోయాక వాడిని ఛీత్కరించి దూరం తరిమేసి తాగుడికి బానిసై ప్రతి అడుగులోనూ తప్పుటడుగులేస్తూ భేషజాలకు పోయి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సంపాదించిన డబ్బును కూడా గౌరవించకుండా, జాగ్రత్త చేయకుండా, లక్ష్యపెట్టకుండా అవసరం లేని ఔదార్యం ప్రదర్శించి అడిగీ అడగని వారికి అందరికి అపాత్ర దానం చేశారు.
అనుభవం లేని చోట్ల పెట్టుబడులు పెట్టి తన బ్రతుకు తానే తాగి పాడు చేసుకుని అర్ధాంతరంగా వెళ్లి పోయిన మొండి ఘటం ఆమె. మంచి చెప్పేవారికి చాలా దూరంగా ఉండడంతో కనీస సానుభూతి నోచుకోలేదు ఆమె. తాగుడు తనంతట తాను చేసుకొన్న అలవాటేగానీ జెమిని ఏం అలవాటు చేయలేదు. ఓ రాజకీయ నాయకుడు ఆమెపైన పగబట్టి ఆదాయపన్ను అధికారులతో దాడులు చేయించి చాలా ఆస్తుల్ని సీజ్ చేయించారు.
ఆమె జీవితం దేవదాసు సినిమాలా ఉంటుంది. తండ్రి మాటకి ఎదురు చెప్పలేని ఓ పిరికివాడు తాగుతూ పలాయనవాదిగా జీవితాన్ని అంతం చేసుకొంటే ఈమె ఆ జెమిని స్త్రీ లోలుడని ఎవరు చెప్పినా వినకుండా అతను మోసం చేసాడని పలాయనవాదంతో బాగా తాగి చనిపోయింది.
అయితే ఆమెకు అవసాన దశలో తినడానికి తిండి లేక కాదు, తెచ్చిపెట్టుకున్న అనారోగ్యం వల్లనే చనిపోయారు. సంవత్సరం పైనే ఆమె కోమాలో ఉంటే ఆమెకి నిరంతరం వైద్యసేవలు అందాయి. అప్పటికి మిగిలిన ఉన్న ఆస్తి కుమార్తె చాముండేశ్వరి సొంతమైంది. అయితే ఆమె అసలు విషయం చెప్పకుండా సావిత్రిని తిడుతూ ఉంటుంది.