ఇడ్లీలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఇడ్లీలను చట్నీ, కారం పొడి లేదా సాంబార్.. దేంతో తిన్నా సరే రుచిగానే ఉంటాయి. ఈ క్రమంలోనే అనేక రకాల ఇడ్లీలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంట్లో ఇడ్లీలను తయారు చేసేటప్పుడు కొన్ని చిట్కాలను పాటిస్తే ఇడ్లీలు మెత్తగా రుచిగా వస్తాయి. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇడ్లీ పిండి పల్చగా ఉంటే కొద్దిగా బొంబాయి రవ్వ కలపాలి. ఇడ్లీ పిండి రుబ్బే సమయంలో గుప్పెడు అటుకులుకానీ, గుప్పెడు అన్నం కానీ వేశారంటే ఇడ్లీలు చాలా మృదువుగా ఉంటాయి. ఇడ్లీ పిండిని టైటుగా మూత పెట్టిన ప్రెజర్ కుక్కర్లో ఉంచారంటే త్వరగా పులుస్తుంది. ఇడ్లీలు చప్పగా కాకుండా రుచిగా ఉంటాయి. ఇడ్లీ పిండిలో చెంచా నువ్వుల నూనె వేస్తే ఇడ్లీలు తెల్లగా మృదువుగా వస్తాయి.
ఇక ఇవే కాకుండా మరికొన్ని చిట్కాలను చూద్దాం. ఉడికించే నీటిలో కొద్దిగా వంటనూనె వేస్తే బంగాళదుంపలు త్వరగా ఉడుకుతాయి. ఉల్లి పాయను అడ్డంగా కోసి దోసెల (అట్లు) పెనం మీద రాస్తే దోసెలు చక్కగా చెడకుండా వస్తాయి. అన్నం, పప్పు వండేటప్పుడు సరిగ్గా అవసరమైనంతవరకే నీటిని పోయండి. అర్జెంటుగా మీకు మజ్జిగ కావలసి వచ్చిందనుకోండి-దానికేం చేస్తారంటే-పాలు గోరు వెచ్చగా వెచ్చబెట్టి అందులో చిటికెడు ఉప్పు వేయండి. కొద్దిగా నిమ్మ పండు రసం కూడా పిండండి. కొద్ది సేపట్లోనే పాలు విరిగి మజ్జిగ అవుతుంది.
అల్యూమినియం లేదా ఇనుప పెనం మీద దోసెలు వేస్తున్నప్పుడు అవి సరిగ్గా రాకుండా అంటుకుపోతుంటే పెనం సరిగ్గా వేడెక్కలేదేమో గమనించండి. సరిగ్గా వేడెక్కకపోతే దోసెలు దానికి అంటుకుపోతాయి. ఆలూ చిప్స్ ఇంట్లో చేసేటప్పుడు నల్లబడి పోకుండా ఉండాలంటే పలచని మస్లిన్ వస్త్రంలో కాస్త సిట్రిక్ యాసిడ్ వేసి దాని ముక్కల్ని ఉడికించే నీటిలో ముంచి తీయాలి.