Kobbari Chutney : కొబ్బ‌రి చ‌ట్నీ ఇలా చేస్తే అన్నం, చ‌పాతీలు, టిఫిన్‌లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Kobbari Chutney : ప‌చ్చికొబ్బ‌రిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ప‌చ్చికొబ్బ‌రి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ప‌చ్చికొబ్బ‌రిని నేరుగా తిన‌డంతో పాటు దీనిని వివిధ ర‌కాల తీపి వంట‌కాల‌ల్లో వాడుతూ ఉంటాము. అలాగే ప‌చ్చికొబ్బ‌రితో ప‌చ్చ‌ళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే కొబ్బ‌రి ప‌చ్చ‌డి కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసేలా ప‌చ్చికొబ్బ‌రితో ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బ‌రి ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చి కొబ్బ‌రి – అర చిప్ప‌, నూనె – ఒక టేబుల్ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, ప‌చ్చిమిర్చి – 6, ఎండుమిర్చి – 4, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ట‌మాట ముక్క‌లు – ఒక క‌ప్పు, ప‌సుపు – అర టీ స్పూన్, చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, ఉప్పు – త‌గినంత‌,జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, పొట్టు వ‌లిచిన వెల్లుల్లి రెమ్మ‌లు – 6.

Kobbari Chutney recipe better tastes with rice or chapati
Kobbari Chutney

కొబ్బ‌రి ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా కొబ్బ‌రిని ముక్కలుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత ప‌చ్చిమిర్చి, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ప‌చ్చికొబ్బ‌రి ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని మ‌రో రెండు నిమిషాల పాటు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, చింత‌పండు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ట‌మాట ముక్క‌లు మ‌గ్గిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత జార్ లో వేయించిన కొబ్బ‌రి ముక్క‌లు, ప‌చ్చిమిర్చిని తీసుకోవాలి.

త‌రువాత ఇందులోనే ఉప్పు, జీల‌క‌ర్ర వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు, ఇంగువ వేసి తాళింపు త‌యారు చేసుకోవాలి. త‌రువాత ఈ తాళింపును ప‌చ్చ‌డిలో వేసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌చ్చికొబ్బ‌రి ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల ఈ ప‌చ్చ‌డి 3 రోజుల పాటు తాజాగా ఉంటుంది.

Share
D

Recent Posts