మనం వంటల్లో ఉపయోగించే వాటిల్లో ఉల్లిపాయ కూడా ఒకటి. ఉల్లిపాయ వాడని వంటగది అంటూ ఉండదు. దాదాపుగా మనం చేసే ప్రతివంటలో ఉల్లిపాయను ఉపయోగిస్తూ ఉంటాము. ఉల్లిపాయను వేయడం వల్ల వంటల రుచి పెరుగుతుంది. అలాగే ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. పచ్చి ఉల్లిపాయలను లేదా ఉడికించిన ఉల్లిపాయలు వీటిని ఏ విధంగా తీసుకున్నా కూడా మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహ వ్యాధి గ్రస్తులు ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో ఇవి మనకు సహాయపడతాయి.
ఉల్లిపాయలల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో, వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా చేయడంలో, చర్మ ఛాయను పెంచడంలో దోహదపడతాయి. ఉల్లిపాయలల్లో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల చాలా సమయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. కనుక వీటిని తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. ఉల్లిపాయలల్లో సల్ఫర్, క్వెర్సెటిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడతాయి. ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఉల్లిపాయలల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్స్, పాలీఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడడంలో దోహదపడతాయి. ఇక ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్పెక్షన్ ల బారిన పడకుండా కాపాడడంలో కూడా ఇవి మనకు సహాయపడతాయి. వీటిలో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. అలర్జీ, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారు ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల చక్కటి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది. వీటిని తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా ఉంటాము. ఈ విధంగా ఉల్లిపాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.