Vegetable Bread Pakoda : మనం బ్రెడ్ తో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో వెజిటేబుల్ బ్రెడ్ పకోడా కూడా ఒకటి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అలాగే వీటిని 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, స్నాక్స్ తినాలనిపించినప్పుడు వీటిని అప్పటికప్పుడు తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ వెజిటేబుల్ బ్రెడ్ పకోడాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి.. ఇప్పుడు తెలుసుకుందాం.
వెజిటేబుల్ బ్రెడ్ పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్టైసెస్ – 5, చిన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన టమాట – 1, చిన్నగా తరిగిన క్యాప్సికం – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, చిన్నగా తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, చిల్లీ ప్లేక్స్ – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత,, టమాట కిచప్ – 2 టేబుల్ స్పూన్స్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, బియ్యంపిండి – పావు కప్పు, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
వెజిటేబుల్ బ్రెడ్ పకోడా తయారీ విధానం..
ముందుగా బ్రెడ్ స్లైసెస్ ను నీటిలో ముంచి నానబెట్టాలి. తరువాత వీటిలో ఉండే నీటిని పూర్తిగా పిండేసి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. నీటిని వేయకుండా అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బ్రెడ్ మిశ్రమాన్ని తీసుకుంటూ పకోడిల్లాగా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ బ్రెడ్ పకోడా తయారవుతుంది. దీనిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.