Black Pepper Powder : నల్ల మిరియాలు.. ఇవి తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. భారతీయులు ఎంతో కాలంగా వీటిని వంటల్లో వాడుతున్నారు. పూర్వం వంటల్లో కారానికి బదులుగా నల్ల మిరియాలనే వాడేవారు. దాదాపు నల్ల మిరియాలు ప్రతి ఒక్కరి వంటగదిలో ఉంటాయని చెప్పవచ్చు. ఇవి వంటలకు మంచి రుచిని తీసుకురావడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. నల్ల మిరియాలను వాడడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నల్ల మిరియాలను వాడడం వల్ల మనకు కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి… ఇప్పుడు తెలుసుకుందాం. నల్ల మిరియాలల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను నశింపజేసి శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి.
అలాగే కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి మన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడడంలో కూడా దోహదపడతాయి. నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల జీర్ణ రసాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం ఎక్కువగా గ్రహించేలా చేయడంలో కూడా నల్ల మిరియాలు మనకు సహాయపడతాయి. నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలు మన శరీరానికి పూర్తిగా అందుతాయి. నల్ల మిరియాల్లో ఉండే పైపెరిన్ శరీరంలో జీవక్రియలను పెంచుతుంది.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను తగ్గించడంలో కూడా ఇది మనకు సహాయపడుతుంది. కనుక నల్ల మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు. అలాగే నల్ల మిరియాలల్లో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. శరీరంలో మంటను, నొప్పులను, వాపును తగ్గించడంలో ఇవి మనకు ఎంతో సహాయపడతాయి. అదే విధంగా నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల శ్వాస సమస్యలు త్వరగా తగ్గుతాయి. జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు నల్ల మిరియాలను వాడడం వల్ల చక్కటి ఉపశమనం కలుగుతుంది. నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
నల్ల మిరియాలను క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి. నల్ల మిరియాలను వాడడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. వయసు పైబడడం వల్ల వచ్చే మతిమరుపు సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మిరియాల్లలో అనాల్జేసిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తరుచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో వచ్చే చిన్న చిన్న నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా నల్ల మిరియాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని మితంగానే వాడాలి. మిరియాలను ఎక్కువగా వాడడం వల్ల కొందరిలో కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక నల్ల మిరియాలను మితంగా వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.