High BP : మారిన జీవన విధానం కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యలల్లో బీపీ కూడా ఒకటి. మారిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. నేటి తరుణంలో 25 నుడి 30 సంవత్సరాల లోపు వారే ఎక్కువగా బీపీ బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే ఇలా బీపీతో బాధపడడం వల్ల అనేక రకాల ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చాలా వారికి ఎటువంటి లక్షణాలు లేవని వారికి బీపీ లేదని భావిస్తూ ఉంటారు. కానీ లక్షణాలు లేనప్పటికి చాలా మంది బీపీతో బాధపడుతన్నారని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. కనుక మనం ఎప్పటికప్పుడు బీపీకి సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అలాగే బీపీ అదుపులో ఉండాలన్నా లేని వారికి రాకుండా ఉండాలన్నా ముందుగా మనం ఉప్పును మానేయాలి. కానీ ఉప్పును మానేయడం అందరి వల్లా కాదు.
కనుక ఉప్పును తక్కువగా తీసుకుంటూనే సహజ సిద్దంగా లభించే సొరకాయతో జ్యూస్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సొరకాయ జ్యూస్ ను తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో సంకోచ వ్యాకోచాలు చక్కగా జరుగుతాయని వారు చెబుతున్నారు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు సొరకాయ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని 2021లో స్పెయిన్ దేశ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. సొరకాయలో 90 శాతం నీరు ఉంటుంది. అలాగే 100 గ్రాముల సొరకాయలో 300 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. బీపీని అదుపులో ఉంచడంలో పొటాషియం మనకు ఎంతో సహాయపడుతుంది. సొరకాయ జ్యూస్ ను తీసుకోవడం వల్ల రక్తనాళాలకు ఉండే సాగే గుణం పెరుగుతుంది. దీంతో బీపీ అదుపులో ఉంటుంది.
అలాగే సొరకాయలో టెట్రాసైక్లిక్ ట్రైటెర్పెనోయిడ్ అనే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంతో పాటు రక్తనాళాలు వ్యాకోచించేలా చేయడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. కనుక బీపీతో బాధపడే వారు అలాగే బీపీ రాకుండా ఉండాలనుకునే వారు రోజూ 250 ఎమ్ ఎల్ నుండి 300 ఎమ్ ఎల్ వరకు సొరకాయ జ్యూస్ ను తీసుకోవచ్చు. లేత సొరకాయను పొట్టు తీయకుండా జ్యూస్ లాగా చేసుకుని వడకట్టి తేనె కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉండడంతో పాటు లేనివారికి కూడా రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.