Diabetes And Banana : అరటి పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. వివిధ రకాల వెరైటీల అరటి పండ్లు మనకు అందుబాటులో ఉంటాయి. అరటి పండ్లను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇవి చవకగా కూడా లభిస్తాయి. కనుక పేద, మధ్య తరగతి వారు సైతం అరటి పండ్లను ఎక్కువగా కొనుగోలు చేసి తింటుంటారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. షుగర్ ఉన్నవారు ఈ పండ్లను తినవచ్చా.. షుగర్ పెరగకుండా ఈ పండ్లను ఎలా తినాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండ్లను బాగా పండినవి కాకుండా కాస్త దోరగా ఉన్నవి తినాలి. బాగా పండినవి అయితే తియ్యదనం ఎక్కువగా ఉంటుంది. కనుక ఆ పండ్లను తింటే తేలిగ్గా జీర్ణమై త్వరగా చక్కెర రక్తంలో కలుస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు బాగా పండిన అరటి పండ్లను కాకుండా కాస్త దోరగా ఉన్న అరటి పండ్లను తింటే మంచిది. వీటిల్లో ఒక మీడియం సైజ్ అరటి పండు అయితే సుమారుగా 14 గ్రాముల మేర కార్బొహైడ్రేట్లు ఉంటాయి. కనుక ఒక పండును తిన్నా ఏమీ కాదు. పెద్దగా షుగర్ లెవల్స్ పెరగవు.

అరటి పండ్లను షుగర్ ఉన్నవారు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తినరాదు. వీటిని బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్, లంచ్ లేదా డిన్నర్ మధ్యలో తినాలి. వీటితోపాటు ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను కలిపి తినాలి. దీంతో అరటి పండ్లలో ఉండే చక్కెరలను శరీరం నెమ్మదిగా శోషించుకుంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ ఒకేసారి పెరగవు. నెమ్మదిగా పెరుగుతాయి. ఇలా అరటి పండ్లను షుగర్ ఉన్నవారు తింటే ఏమీ కాదు.
అరటి పండ్లను తింటే కొందరిలో షుగర్ లెవల్స్ త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. కనుక అరటి పండ్లను తిన్న అనంతరం గంటన్నర సమయం పాటు ఆగి షుగర్ చెక్ చేయాలి. ఎక్కువగా ఉంటే అలాంటి వారు ఈ పండ్లను తినరాదు. షుగర్ లెవల్స్ తక్కువగా ఉంటే ఈ పండ్లను తినవచ్చు. ఇలా షుగర్ ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా అరటి పండ్లను తీసుకోవచ్చు. దీని వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.