Diabetes Symptoms In Telugu : మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తుతున్న అనారోగ్య సమస్యలల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా నేటి తరుణంలో అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, గంటల తరబడి కూర్చుని పని చేయడం, వంశపారపర్యం వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది ఈ షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సి వస్తుంది. అలాగే ఖచ్చితమైన ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. అయితే చాలా మందికి ఈ వ్యాధి యొక్క లక్షణాలు తెలియని కారణంగా వారు షుగర్ తో బాధపడుతున్నారని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
దీంతో షుగర్ వ్యాధి ముదిరి వారు తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నారు. షుగర్ వ్యాధి తీవ్రత పెరిగే కొద్ది శరీరంలో అవయవాలు దెబ్బతినే అవకాశాలు పెరుగుతాయి. కనుక ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడం చాలా అవసరం. షుగర్ వ్యాధి బారిన పడిన వెంటనే మనలో కనిపించే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహంతో బాధపడే వారిలో చర్మం రంగు మారుతుంది. మెడ, చంకలు, గజ్జలు వంటి భాగాల్లో చర్మం నల్లగా మారుతుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో వారు తరుచూ ఇన్పెక్షన్ ల బారిన పడుతూ ఉంటారు. అంటువ్యాధులు, చర్మ వ్యాధులు, ఈస్ట్ ఇన్పెక్షన్ ల వంటి వాటి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారిలో నోటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
ముఖ్యంగా చిగుళ్ల వ్యాధి యొక్క తీవ్రరూపమైన పీరియాడోంటిటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిగుళ్ల నుండి రక్తం కారడం, నోటి దుర్వాసన వంటి సమస్యలు ఎక్కువగా ఉంటే షుగర్ వ్యాధికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలల్లో మార్పు కారణంగా కంటి చూపులో తేడా వస్తుంది. కంటి చూపు మందగిస్తుంది. మసకగా, అస్పష్టంగా కనిపిస్తుంది. కంటిచూపులో గనుక అకస్మాత్తుగా తేడాలు వస్తే షుగర్ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల నరాలు దెబ్బతింటాయి. దీంతో వినికిడిలో లోపం వస్తుంది. వినికిడి సమస్యలు తలెత్తుతాయి. కనుక వినికిడి లోపం వచ్చిన వెంటనే రక్తపరీక్షలు చేయించుకోవాలి.
పిల్లల్లో కనుక ఈ సమస్య వస్తే వారు రాత్రి పూట తరుచూ పక్క తడిపేస్తూ ఉంటారు. షుగర్ కారణంగా మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుంది. దీంతో పిల్లలు ఎక్కువగా పక్క తడిపేస్తూ ఉంటారు. షుగర్ వ్యాధితో బాధపడే వారిలో మానసిక స్థితిలో కూడా అనేక మార్పులు వస్తాయి. ఎక్కువగా చిరాకు, కోపం, మానసికంగా అల్లకల్లోలం, ఏకాగ్రత లోపించడం వంటివి కనిపిస్తాయి. అలాగే షుగర్ వ్యాధితో బాధపడే వారిలో నరాల సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. నరాల తిమ్మిర్లు, నరాల్లో సూదులు గుచ్చినట్టు ఉండడం, వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ విధంగా ఈ లక్షణాలు కనుక మీలో కనిపించినట్లయితే తక్షణమే వైద్యున్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.