Tea : చల్లని వాతావరణంలో వేడి వేడి టీ తాగితే వచ్చే మజాయే వేరు. వాతావరణం అలా ఉంటే చాలా మంది టీలను పదే పదే తాగుతుంటారు. ఇక కొందరు ఉదయం నిద్ర లేవగానే తమ రోజును టీ తో మొదలు పెడతారు. అయితే టీ తాగడం వరకు బాగానే ఉన్నప్పటికీ కొందరు టీతోపాటు పలు ఇతర ఆహారాలను కూడా తీసుకుంటుంటారు. కానీ వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయన్న విషయం చాలా మందికి తెలియదు. టీతోపాటు పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. టీతోపాటు ఎలాంటి ఆహారాలను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
కొందరు పండ్లను తిని టీ తాగుతారు. అయితే పుల్లగా ఉండే పండ్లను తిని మాత్రం టీ తాగకూడదు. ఎందుకంటే పుల్లని పండ్లలో యాసిడ్లు ఉంటాయి. అలాగే టీలోనూ యాసిడ్లు ఉంటాయి. కనుక వెంట వెంటనే రెండింటినీ తీసుకుంటే మీ జీర్ణాశయంలో యాసిడ్ల ప్రభావం పెరిగిపోతుంది. దీంతో మీకు పొట్టలో అసౌకర్యం ఏర్పడుతుంది. ఫలితంగా గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కనుక పుల్లని పండ్లను తిన్న వెంటనే టీ తాగకూడదు. కాస్త గ్యాప్ ఇవ్వాలి.
కొందరు కార కారంగా ఉండే ఆహారాలను తింటూ టీ తాగుతారు. ఇలా కూడా అసలు చేయకూడదు. ఇది కూడా జీర్ణాశయంలో అసౌకర్యాన్ని కలగజేస్తాయి. కనుక వీటిని కూడా టీ తోపాటు తీసుకోకూడదు. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తిన్న వెంటనే కూడా కొందరు టీ తాగుతారు. టీలోనూ చక్కెర ఎక్కువగానే ఉంటుంది. కనుక వెంట వెంటనే వీటిని తీసుకోవడం వల్ల మీ శరీరంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి. ఇలా దీర్ఘకాలం పాటు గనక జరిగితే మీకు డయాబెటిస్ వచ్చే చాన్స్ ఉంటుంది. కనుక ఇలా కూడా చేయకూడదు.
ఉప్పు ఎక్కువగా ఉండే పకోడీలు లేదా సాల్టెడ్ చిప్స్, ఇతర ఆహారాలను కూడా టీతోపాటు తీసుకోకూడదు. ఇవి మీ కిడ్నీలకు హాని కలగజేస్తాయి. అలాగే చీజ్, వేపుళ్లు, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, మాంసాహారం వంటి వాటిని కూడా టీతో తీసుకోకూడదు. మీరు టీతో కేవలం నట్స్ లేదా సీడ్స్‌ను మాత్రమే తినాలి. ఇవి మీకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఎలాంటి హాని కలిగించవు. కనుక ఇకపై మీరు టీ తాగితే ఈ ఆహారాల విషయంలో జాగ్రత్తలను పాటించండి. లేదంటే ఇబ్బందులు వస్తాయన్న సంగతిని గుర్తుంచుకోండి.