Tea : మనలో చాలా మందికి టీ తాగే అలవాటు ఉంది. చాలా మందికి టీ తాగగానే ఏదో కొత్త ఉత్సాహం వచ్చి చేరినట్టుగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, అలసటను తగ్గించడానికి, ఒత్తిడి నుండి బయటపడడానికి, రోజంతా ఉత్సాహంగా ఉండడానికి ఎక్కువగా టీ ని తాగుతూ ఉంటారు. చాలా మంది ఒక్కో చుక్క టీ ని ఆస్వాదిస్తూ తాగుతూ ఉంటారు. కొన్ని చిట్కాలను పాటిస్తూ టీ ని తయారు చేయడం వల్ల ఎప్పుడూ చేసిన టీ ఒకేలా రావడంతో పాటు చక్కటి రుచిని కూడా కలిగి ఉంటుంది. చక్కటి రుచి రంగు కలిగేలా టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టీ పెట్టటప్పుడూ ఎప్పుడూ కూడా పచ్చి పాలతోనే పెట్టాలి. పచ్చి పాలతో చేసిన టీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిలో రుచి కొరకు రెండు అల్లం ముక్కలు, రెండు యాలకులను, రెండు లవంగాలను కూడా వేసుకోవచ్చు. వీటిని కచ్చా పచ్చాగా దంచి పక్కకు ఉంచాలి. ముందుగా ఒక గిన్నెలో మూడు కప్పుల నీటిని తీసుకుని ఒక పొంగు వచ్చే వరకు వేడి చేయాలి. ఇలా వేడి చేసిన తరువాత ముందుగా దంచి పెట్టుకున్న యాలకులు, లవంగాలు, అల్లం వేసి నీటిని 3 నుండి 4 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత 3 టీ స్పూన్ల టీ పౌడర్ వేసుకోవాలి. తరువాత రుచికి తగినంత పంచదారను వేసి 3 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఒక కప్పు పాలను పోసి కలపాలి.

పాలు పోసిన తరువాత టీ ని ఎక్కువగా సేపు మరిగించడం వల్ల టీ రుచి మారే అవకాశం ఉంది. కనుక ఈ టీ ని రెండు నుండి మూడు పొంగులు వచ్చే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ టీ ని వడకట్టి గ్లాస్ లో పోసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చక్కటి వాసన, రంగు, రుచి ఉండే టీ తయారవుతుంది. ఒక కప్పు పాలకు, మూడు కప్పుల నీళ్లు ఇలా పక్కా కొలతలతో చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టీ ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన టీ ని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు.