Health Tips : సాధారణంగా ఎవరైనా సరే చిన్నతనం నుంచి పాలను తాగుతుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు రోజూ పాలను ఇస్తుంటారు. దీంతో పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. అనేక పోషకాలు పాలలో ఉంటాయి కనుక పోషణ సరిగ్గా లభిస్తుంది. ఎదుగుదల లోపాలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది గేదె పాలను, ఆవు పాలను ఎక్కువగా తాగుతుంటారు.
ఒక కప్పు పాలను తాగడం వల్ల మనకు సుమారుగా 146 క్యాలరీలు లభిస్తాయి. పాలలో విటమిన్ డితోపాటు కాల్షియం, ప్రోటీన్లు, ఇతర మినరల్స్ ఉంటాయి. అందువల్ల పాలను తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఆయుర్వేద ప్రకారం పాలను ఎప్పుడు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయుర్వేద ప్రకారం ఎవరైనా సరే రోజూ 2 నుంచి 3 రకాల పాల ఉత్పత్తులను తీసుకుంటే మంచిది. అంటే పాలతోపాటు పెరుగు, నెయ్యి వంటివి కూడా రోజూ తీసుకోవాలన్నమాట. ఇక పాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనంతరం లేదా రాత్రి నిద్రకు 30 నిమిషాల ముందు తాగితే మంచిదని ఆయుర్వేదం చెబుతోంది.
అలాగే పాలలో రాత్రి పూట అల్లం రసం, యాలకుల పొడి, మిరియాల పొడి, పసుపు వంటి కలుపుకుని తాగితే ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఇలా చేయడం వల్ల అనేక వ్యాధులను రాకుండా చూసుకోవచ్చు.
ఇక పాలతోపాటు పెరుగును కూడా రోజూ తీసుకోవాలి. పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కనుక ఎముకలు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. అందువల్ల రోజూ పెరుగును కూడా తినాలి. పెరుగును మధ్యాహ్నం లేదా రాత్రి తినవచ్చు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు పెరుగును మధ్యాహ్నం తినాలి. రాత్రి పూట తింటే శరీరంలో శ్లేష్మం ఎక్కువగా తయారై మరిన్ని ఇబ్బందులు వస్తాయి. కనుక శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు మధ్యాహ్నం భోజనం అనంతరం పెరుగును తీసుకోవచ్చు. ఇక మిగిలిన వారు రాత్రి కూడా పెరుగును తినవచ్చు.
రోజూ పాలు, పెరుగుతోపాటు నెయ్యిని కూడా తీసుకుంటే ఎంతో ఆరోగ్యం లభిస్తుంది. నెయ్యి ద్వారా విటమిన్లు ఎ, డి, ఇ, కె లభిస్తాయి. దీంతో ఎముకలు దృఢంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. నెయ్యిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె సురక్షితంగా ఉంటుంది. అధిక బరువు తగ్గడం సులభతరం అవుతుంది. నెయ్యిని పరగడుపునే 1 లేదా 2 టీస్పూన్లు తీసుకోవచ్చు. లేదా మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో 1 టీస్పూన్ చొప్పున తీసుకోవచ్చు. మోతాదుకు మించకుండా తీసుకోవాలి. రాత్రి నెయ్యి తీసుకుంటే అందులో కొద్దిగా త్రిఫల చూర్ణం కలిపి తీసుకోవాలి. దీంతో కంటి చూపు పెరుగుతుంది.
ఈ విధంగా పాలు, పెరుగు, నెయ్యిలను ఆయుర్వేదం ప్రకారం రోజూ తీసుకోవడ వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. వ్యాధుల నుంచి బయట పడవచ్చు. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.