Lemon Water For Weight Loss : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. శరీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడం అనేది ఎంతో కష్టమైన పనిగా మారింది. అధిక బరువు కారణంగా మనకు తెలియకుండానే మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. అధిక రక్తపోటు , గుండె జబ్బులు, షుగర్, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం, కీళ్ల నొప్పులు వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యలు అధిక బరువు కారణంగా తలెత్తే అవకాశం ఉంది. అధిక బరువు సమస్య నుండి బయటపడడానికి మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అధిక బరువు సమస్య నుండి బయటపడడానికి మనం చేసే ప్రయత్నాల్లో నిమ్మరసం కలిపిన నీటిని తీసుకోవడం కూడా ఒకటి. నిమ్మకాయ బరువు తగ్గడంలో, శరీరంలో కొవ్వును కరిగించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించడంలో మనకు ఎంతో ఉపయోగపడుతుంది.
చాలా మంది బరువు తగ్గడానికి పరగడుపున నిమ్మరసం కలిపిన గోరు వెచ్చని నీటిని తాగుతూ ఉంటారు. అయినా కూడా ఎలాంటి ఫలితం కనబడడం లేదని ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాగే ఈ నీటిలో తేనెను కూడా కలిపి కొంత మంది తీసుకుంటారు. నిమ్మరసాన్ని సరైన పద్దతిలో ఎలా తీసుకోవాలో తెలియనంత కాలం ఎలాంటి ఫలితం మనకు కనిపించదు. బరువు తగ్గడానికి నిమ్మకాయను సరైన పద్దతిలో ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సరైన పద్దతిలో కనుక నిమ్మరసాన్ని తీసుకుంటే దీనిలో ఉండే ఔషధ గుణాలు శరీరానికి పూర్తి స్థాయిలో అందుతాయి. దీని వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. చాలా మంది నిమ్మ రసం కలిపిన నీటిని తీసుకునేటప్పుడు దానిలో పంచదారను కలుపుతూ ఉంటారు. పంచదారను కలపడం వల్ల బరువు తగ్గకపోగా మరింత పెరిగే అవకాశం ఉంది. బరువు తగ్గడానికి తీసుకునే నిమ్మరసంలో తేనెను మాత్రమే కలపాలి. అలాగే ఈ తేనెను కూడా నీరు గోరు వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే కలపాలి.

వేడి నీటిలో తేనెను అస్సలు కలపకూడదు. అలాగే నిమ్మరసం, తేనె కలిపిన తరువాత నీళ్లు చల్లబడితే వీటిని మరలా వేడి చేయకూడదు. ఇలా చేయడం వల్ల నిమ్మకాయ, తేనెలో ఉండే పోషకాలు తొలగిపోతాయి. అలాగే మనలో చాలా మంది నిమ్మరసాన్ని తీసుకుని నిమ్మ తొక్కలను పడేస్తూ ఉంటారు. కానీ నిమ్మరసంలో కంటే నిమ్మతొక్కలోనే ఔషధ గుణాలు మరింతగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు నిమ్మరసంతో పాటు నిమ్మతొక్కను ఉపయోగించడం వల్ల మరిన్ని ఫలితాలను పొందవచ్చు. నిమ్మకాయను ఉపయోగించి బరువు తగ్గించే పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత నిమ్మకాయ తొక్కలోని తెలుపు భాగం రాకుండా కేవలం పసుపు రంగులో ఉండే భాగాన్ని మాత్రమే తురుముకోవాలి. తరువాత ఒక గిన్నెలో పావు లీరటర్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక వాటిని ఒక కప్పులోకి తీసుకోవాలి.
తరువాత ఈ నీటిలో నిమ్మతొక్క తురుమును వేసి మూత పెట్టి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత ఈ నీటిలో అర చెక్క నిమ్మరసాన్ని పిండాలి. అవసరమైతేనే దీనిలో అర టీ స్పూన్ తేనెను వేసుకోవాలి. ఇలా నిమ్మరసం, నిమ్మతొక్కను ఉపయోగించి చేసిన పానీయాన్ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అలాగే ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల మనం రోజంతా ఉత్సాహాంగా ఉండవచ్చు. ఈ విధంగా నిమ్మరసం, నిమ్మతొక్కతో చేసిన నీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మనం అనేక ఇతర అద్భుతమైన ఫలితాలను కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.