Blood Increase : మన శరీరానికి రక్తం ఇంధనంలా పనిచేస్తుంది. మనం తినే ఆహారాల్లో ఉండే పోషకాలతోపాటు మనం పీల్చే గాలిలో ఉండే ఆక్సిజన్‌ను రక్తం శరీర భాగాలకు సరఫరా చేస్తుంది. అలాగే ఆయా భాగాల్లో ఉత్పన్నం అయ్యే వ్యర్థాలను రక్తం సేకరించి బయటకు పంపేందుకు సహకరిస్తుంది. ఇలా రక్తం మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. డాక్టర్లు సైతం మనకు ఉన్న అనారోగ్య సమస్యలను తెలుసుకునేందుకు ముందుగా రక్త పరీక్షలు చేస్తారు. కనుక రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
అయితే కొందరికి పలు కారణాల వల్ల రక్తం తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, గాయాలు అయి రక్తం అధికంగా కోల్పోయిన వారికి, మహిళలకు రుతు సమయంలో, పోషకాహార లోపం ఉన్నవారికి రక్తం తక్కువగా ఉంటుంది. దీంతో వైద్యులు రక్తాన్ని పెంచేందుకు విటమిన్ ట్యాబ్లెట్లను రాసిస్తుంటారు. వాటిని వైద్యుల సూచన మేరకు కనీసం ఒక నెల రోజుల పాటు అయినా వాడాల్సి ఉంటుంది. ఇక రక్తాన్ని వెంటనే పెంచుకునేందుకు గాను కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో రక్తం పరిమాణం వేగంగా పెరుగుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. మరి అందుకు రోజూ ఏయే ఆహారాలను తీసుకోవాలంటే..
1. రక్తాన్ని వేగంగా పెంచేందుకు బీట్‌రూట్ అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక కప్పు బీట్‌రూట్ ముక్కలను తినాలి. లేదా ఒక కప్పు బీట్‌రూట్ జ్యూస్‌ను తాగాలి. దీంతో కేవలం వారం రోజుల్లోనే అద్భుతమైన మార్పు గమనిస్తారు. రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు.
2. మాంసాహార ప్రియులు అయితే వారంలో కనీసం రెండు సార్లు మాంసాహారం తినాలి. ముఖ్యంగా మటన్, మటన్ లివర్‌ను తీసుకోవడం వల్ల శరీరానికి ఐరన్, విటమిన్ బి12 లభిస్తాయి. ఇవి ఎర్ర రక్త కణాల తయారీకి ఉపయోగపడతాయి. రక్తం బాగా పెరిగేలా చేస్తాయి.
3. బ్రౌన్ రైస్‌లో ఐరన్ అధికంగా ఉంటుంది. దీన్ని రోజూ ఒకసారి తినాలి. దీని వల్ల రక్తం బాగా తయారవుతుంది.
4. గుమ్మడికాయ విత్తనాల్లో జింక్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తం పెరిగేందుకు ఉపయోగపడతాయి. రోజూ ఒక గుప్పెడు మోతాదులో గుమ్మడికాయ విత్తనాలను తింటుంటే రక్తం బాగా తయారవుతుంది.
5. డార్క్ చాకొలెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలు దెబ్బ తినకుండా చూస్తాయి. దీంతో కొత్త కణాలు ఏర్పడేందుకు మార్గం సుగమం అవుతుంది. ఫలితంగా ఎర్ర రక్త కణాలు పెరిగి రక్తం బాగా తయారవుతుంది.
6. వాల్ నట్స్, పిస్తా, జీడిపప్పు, బాదంపప్పులను రోజూ ఒక కప్పు మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఐరన్ బాగా లభిస్తాయి. దీంతో రక్తం పెరుగుతుంది.
7. పాలకూర, గోంగూర, తోటకూర, చుక్క కూర వంటి ఆకుకూరల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. రోజూ వీటిని కూర చేసుకుని తినవచ్చు. లేదా జ్యూస్ తయారు చేసి ఒక కప్పు మోతాదులో తాగవచ్చు.
8. చేపలు, రొయ్యలు, తృణ ధాన్యాలు, టమాటాలు, స్ట్రాబెర్రీలు, యాపిల్ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా శరీరానికి ఐరన్, విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తాయి. దీంతో రక్తం వేగంగా పెరుగుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.