Kidney Stones : కిడ్నీ స్టోన్స్ సమస్య అనేది ఒకప్పుడు 40 ఏళ్లు పైబడిన వారికే వచ్చేది. కానీ ఇప్పుడు 20 ఏళ్ల లోపు వారు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీ స్టోన్ల సమస్య వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. పొత్తి కడుపు కింది భాగంలో కుడి లేదా ఎడమ వైపు, ఒక్కోసారి రెండు వైపులా తీవ్రమైన భరించలేని నొప్పి వస్తుంది. దీంతోపాటు కొందరికి వణుకుతో కూడిన జ్వరం ఉంటుంది. కొందరికి వికారంగా ఉండి వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి తరచూ మూత్రం వస్తుంది. మూత్రం విసర్జిస్తుంటే మంటగా, నొప్పిగా ఉంటుంది. కొన్ని సార్లు మూత్రంలో రక్తం కూడా పడవచ్చు.
అయితే కిడ్నీ స్టోన్లు ఉన్న అందరికీ ఈ లక్షణాలు కనిపించాలని ఏమీ లేదు. కొందరికి కేవలం కొన్ని లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ కిడ్నీ స్టోన్ల సమస్య వస్తే మాత్రం డాక్టర్ చేత చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. చాలా చిన్న స్టోన్స్ అయితే అవి కరిగిపోయేందుకు వైద్యులు మెడిసిన్లను ఇస్తారు. దీంతో కొద్ది రోజుల్లోనే సమస్య నుంచి బయట పడవచ్చు. అయితే స్టోన్లు మరీ పెద్దగా ఉంటే మాత్రం సర్జరీ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల స్టోన్స్ నుంచి విముక్తి లభిస్తుంది. అయితే కిడ్నీ స్టోన్లు ఏర్పడేందుకు ప్రధాన కారణం మనం తినే ఆహారమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా పలు రకాల కూరగాయలను మరీ ఎక్కువగా తినడం వల్ల కిడ్నీ స్టోన్లు ఏర్పడుతాయి. ఇక ఆ కూరగాయలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకూరలోనూ..
పాలకూరలో అధిక మొత్తంలో ఆగ్జలేట్స్ ఉంటాయి. అందువల్ల పాలకూరను అధికంగా తింటే మన శరీరంలో ఆగ్జలేట్స్ పేరుకుపోతాయి. ఫలితంగా కిడ్నీ స్టోన్లు ఏర్పడుతాయి. అలాగే బీన్స్ కూడా కిడ్నీ స్టోన్లు ఏర్పడేందుకు కారణం అవుతాయి. వీటిల్లోనూ అధిక మొత్తం ఆగ్జలేట్స్ ఉంటాయి. వీటిని అధికంగా తినడం మంచిది కాదు. కిడ్నీ స్టోన్లను కలగజేస్తాయి. అదేవిధంగా వంకాయల్లోనూ ఆగ్జలేట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక వీటిని కూడా అతిగా తినడం మంచిది కాదు.
టమాటాలను కొందరు రోజూ తింటుంటారు. వీటిల్లోనూ ఆగ్జలేట్స్ అధిక పరిమాణంలోనే ఉంటాయి. అందువల్ల టమాటాలను అధికంగా తింటే కిడ్నీ స్టోన్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. ఇక టమాటాలను పాలకూరతో కలిపి తిన్నట్లయితే కిడ్నీ స్టోన్లు ఏర్పడే అవకాశాలు రెట్టింపు అవుతాయి. కనుక ఈ రెండింటినీ కలిపి ఎట్టి పరిస్థితిలోనూ తినకూడదు. అలాగే కీరదోసలోనూ కొద్దిమొత్తంలో ఆగ్జలేట్స్ ఉంటాయి. ఇవి మనకు హాని చేయవు. అలా అని చెప్పి కీరదోసను కూడా ఎక్కువ తినకూడదు. ఆగ్జలేట్స్ ఉండే ఇతర కూరగాయలతో కలిపి వీటిని తీసుకోకూడదు. లేదంటే కిడ్నీ స్టోన్లు ఏర్పడుతాయి. ఇలా పలు రకాల కూరగాయలను జాగ్రత్తగా తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా ఉంటాయి.
ఇవి కూడా కారణాలే..
అయితే కిడ్నీ స్టోన్లు ఏర్పడేందుకు ఇవే కాదు, ఇంకా అనేక కారణాలు ఉంటాయి. నీళ్లను సరిగ్గా తాగకపోయినా, వేడి ఎక్కువగా ఉండే ప్రదేశంలో పనిచేసినా, పలు రకాల వ్యాధులు ఉన్నా, దీర్ఘకాలికంగా మందులను వాడుతున్నా, క్యాల్షియం ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నా కూడా కిడ్నీ స్టోన్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. కనుక ఈ ఆహారాలను ఎట్టి పరిస్థితిలోనూ తీసుకోకూడదు. లేదంటే కిడ్నీ స్టోన్ల బారిన పడి ఇబ్బందులు పడాల్సి వస్తుంది.