నిద్రలేమి సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. రాత్రి త్వరగా భోజనం చేసి బెడ్‌పై పడుకున్నా.. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు. నిద్ర పట్టకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు ఉండడం, రోజూ ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కోవడం, ఇతర మానసిక సమస్యలు, ఫోన్లను ఎక్కువగా రాత్రి పూట ఉపయోగించడం.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి నిద్రలేమి సమస్య వస్తోంది. అయితే అందుకు ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నిద్రలేమి సమస్యను తగ్గించుకునేందుకు పాలు, తేనె అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో సెడేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. రాత్రి భోజనం అనంతరం ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో 1 టీస్పూన్ తేనెను కలిపి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. కనీసం ఇలా వారం పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే ఫలితం ఉంటుంది.
2. పాలలో తేనె కలిపి తాగుతున్నా నిద్ర పట్టడం లేదని భావించే వారు అశ్వగంధ చూర్ణం వాడవచ్చు. పాలలో ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణం కలిపి తీసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించడంలో అశ్వగంధ అద్భుతంగా పనిచేస్తుంది. నిద్ర వచ్చేలా చేస్తుంది. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. కనుక పాలలో 1 టీస్పూన్ అశ్వగంధ పొడిని కలిపి తీసుకోవచ్చు.
3. అశ్వగంధ లాగే జటమాంసి చూర్ణం కూడా పనిచేస్తుంది. దీన్ని కూడా పాలలో కలిపి తీసుకోవచ్చు.
4. అశ్వగంధ, జటమాంసి రెండు చూర్ణాలను అర టీస్పూన్ చొప్పున తీసుకుని ఒక టీస్పూన్ మిశ్రమంగా చేసి ఒక గ్లాస్ పాలలో కలిపి కూడా తాగవచ్చు. అయితే ఈ రెండూ ట్యాబ్లెట్ల రూపంలోనూ లభిస్తాయి. వాటిని కూడా వాడుకోవచ్చు.
5. నిద్రలేమి సమస్యకు చందనాది తైలం కూడా పనిచేస్తుంది. దీన్ని రాత్రి పూట కొద్దిగా తీసుకుని జుట్టుకు సున్నితంగా మర్దనా చేయాలి. అలాగే పాదాలపై రాసి మర్దనా చేయాలి. దీంతో శరీరానికి హాయి కలుగుతుంది. చక్కగా నిద్ర పడుతుంది. అరికాళ్లలో మంటలు తగ్గుతాయి.