మూలికలు, మసాలా దినుసులను నిత్యం మనం వంటల్లో ఉపయోగిస్తుంటాం. ఇవి చక్కని రుచిని, సువాసనను వంటకాలకు అందిస్తాయి. దీంతో ఒక్కో వంటకం ఒక్కో ప్రత్యేకమైన రుచిని మనకు అందిస్తుంది. అయితే వాటినే మనం సరిగ్గా ఉపయోగించాలే కానీ వాటితో కషాయం చేసుకుని తాగవచ్చు. దీంతో దగ్గు, జలుబు సమస్యల నుంచి బయట పడవచ్చు. ఆయా సమస్యలకు ఈ విధంగా సహజసిద్ధమైన చికిత్స చేసుకోవచ్చు.
దగ్గు, జలుబులను తగ్గించే కషాయాన్ని తయారు చేసుకునేందుకు కావల్సిన పదార్థాలు:
* ధనియాలు – అర టీస్పూన్
* జీలకర్ర – అర టీస్పూన్
* సోంపు గింజలు – 1 టీస్పూన్
* నల్ల మిరియాలు – 8 నుంచి 10 గింజలు
* ఎండిన అల్లం పొడి – 1 టీస్పూన్
* యాలకులు – అర టీస్పూన్
* జాజికాయ పొడి – అర టీస్పూన్
* అతి మధురం వేర్లు – 3 నుంచి 4
* బెల్లం – రుచికి తగినంత
* పాలు – అర కప్పు
* నీళ్లు – అర కప్పు
కషాయం తయారు చేసే విధానం:
ధనియాలు, జీలకర్ర, సోంపు గింజలు, నల్ల మిరియాలను పెనంపై వేయించి చల్లార్చాలి. అతి మధురం వేర్లను తీసుకుని పొడి చేయాలి. ధనియాల నుంచి అతి మధురం పొడి వరకు అన్ని పదార్థాలను కలిపి బ్లెండర్‌లో వేసి మెత్తని పొడిలా పట్టుకోవాలి. అనంతరం ఆ పొడిని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇక అందులోంచి 1 టీస్పూన్ మిశ్రమాన్ని తీసుకుని దాన్ని మరుగుతున్న నీటిలో వేసి బాగా కలపాలి. బాగా మరిగాక అందులో పాలు పోసి మళ్లీ మరిగించాలి. స్టవ్ ఆర్పి ఆ మిశ్రమంలో బెల్లం లేదా బెల్లం పొడి వేయాలి. అవసరం అనుకుంటే కొద్దిగా పసుపు కలుపుకోవచ్చు. దీంతో కషాయం రెడీ అవుతుంది.
అయితే పాలను కలపాల్సిన పనిలేకుండా కొందరు నేరుగా డికాషన్ తరహాలోనూ కషాయాన్ని తాగుతారు. అలా కూడా తీసుకోవచ్చు. అలాంటప్పుడు రుచి కోసం బెల్లం కాకుండా తేనె కలుపుకోవచ్చు. నిమ్మరసం జత చేయవచ్చు. దీంతో అద్భుతమైన కషాయం రెడీ అవుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల దగ్గు, జలుబు ఇతర సమస్యలు పోతాయి. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.