ఎండాకాలంలో సహజంగానే చాలా మంది తమ శరీరాలను చల్లగా ఉంచుకునేందుకు యత్నిస్తుంటారు. అందులో భాగంగానే చల్లని పానీయాలను తాగుతుంటారు. కానీ వేసవిలో కృత్రిమంగా తయారు చేయబడిన కూల్ డ్రింక్స్‌కు బదులుగా సహజసిద్ధంగా తయారు చేసుకునే చల్లని పానీయాలనే తాగాల్సి ఉంటుంది. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా సోంపు గింజలతో తయారు చేసే పానీయాన్ని తాగితే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
సోంపు గింజలతో తయారు చేసే పానీయాన్ని నిత్యం తాగడం వల్ల శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. ఎండ వేడి నుంచి తప్పించుకోవచ్చు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం చల్లగా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. అధిక బరువు తగ్గవచ్చు.
సోంపు గింజల డ్రింక్ తయారీకి కావల్సిన పదార్థాలు
- సోంపు గింజల పొడి – పావు కప్పు
- నల్లరంగు కిస్మిస్ – 1 టేబుల్ స్పూన్
- పటిక బెల్లం – 2 టేబుల్ స్పూన్లు
- నిమ్మ రసం – 1 టీస్పూన్
- నీళ్లు – 2 కప్పులు
సోంపు గింజల డ్రింక్ తయారీ విధానం
సోంపు గింజల పొడిని నీటిలో 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టాలి. నల్ల కిస్మిస్‌లను కూడా అంతే సమయం పాటు నీటిలో నానబెట్టాలి. సోంపు గింజల పొడి నానాక దాన్ని వడకట్టాలి. ఆ నీటిని సేకరించాలి. అందులో నల్ల కిస్మిస్‌లను పేస్ట్‌లా చేసి కలపాలి. తరువాత ఆ మిశ్రమంలో పటిక బెల్లం వేసి బాగా కలపాలి. నిమ్మరసం కలుపుకోవాలి. అవసరం అయినంత మేర నీటిని కలుపుకోవాలి. దీంతో సోంపు గింజల డ్రింక్ తయారవుతుంది. దీన్ని వేసవిలో రోజూ తీసుకుంటే శరీరం చల్లగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతల నుంచి రక్షణ లభిస్తుంది.