Korra Idli : చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలు మనకు ఎంతగా మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి కొర్రలు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని తింటే బీపీ తగ్గుతుంది. అధిక బరువున తగ్గించుకోవచ్చు. ఇంకా ఎన్నో లాభాలు మనకు కొర్రల వల్ల కలుగుతాయి. అయితే వీటితో ఇడ్లీలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు.. మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఇక కొర్రలతో ఇడ్లీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొర్రలతో ఇడ్లీలు తయారీకి కావల్సిన పదార్థాలు..
కొర్రల రవ్వ – 3 కప్పులు, మినప పప్పు – ఒక కప్పు, నెయ్యి – తగినంత, ఉప్పు – సరిపడా.
కొర్రల ఇడ్లీలు తయారు చేసే విధానం..
మినప పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారుగా 3 గంటల పాటు నానబెట్టాలి. కొర్రల రవ్వకు తగినన్ని నీళ్లను జతచేసి మూడు గంటల పాటు నానబెట్టాలి. పప్పులో నీళ్లు వడగట్టి మినప పప్పును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. రవ్వలో నీటిని గట్టిగా పిండి తీసేసి రుబ్బిన పిండిలో కలుపుకోవాలి. తగినంత ఉప్పు జత చేసి సుమారుగా 6 నుంచి 7 గంటల పాటు నానబెట్టాలి. ఇడ్లీ రేకులకు నెయ్యి రాసి పిండిని గరిటతో వేసి ఇడ్లీ కుక్కుర్‌లో రేకులను ఉంచి స్టవ్ మీద పెట్టి ఆవిరి మీద ఉడికించాలి. వేడి వేడి ఇడ్లీలను చట్నీతో వడ్డించాలి. ఇలా తయారు చేసుకున్న ఇడ్లీలను కొబ్బరి లేదా పల్లి, టమాటా చట్నీలతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.