Acidity : ప్రస్తుత తరుణంలో అసిడిటీ, గ్యాస్, కడుపులో మంట సమస్యలు చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నిపుణులు చెబుతున్న ప్రకారం.. ప్రతి 10 మందిలో దాదాపుగా 8 మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కడుపులో మంటతోపాటు త్రేన్పులు, కడుపు ఉబ్బరం, మలబద్దకం, అజీర్ణం.. వంటి సమస్యలతోనూ సతమతం అవుతున్నారు.
సాధారణంగా మనకు ఈ సమస్యలన్నీ పలు కారణాల వస్తుంటాయి. అసిడిటీని కలిగించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం లేదా అజీర్ణం.. కారం, మసాలాలను అధికంగా తీసుకోవడం.. వేళకు భోజనం చేయకపోవడం.. వంటి అనేక కారణాల వల్ల ఆయా సమస్యలు వస్తుంటాయి. అయితే వీటిని తగ్గించుకునేందుకు ఇంగ్లిష్ మందులను వాడాల్సిన పనిలేదు. కింద తెలిపిన రెండు చిట్కాలను పాటిస్తే చాలు.. ఈ సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
ముందుగా 20 ఎంఎల్ పాలను తీసుకోవాలి. వాటిని మరిగించి చల్లార్చాలి. అనంతరం ఆ పాలను సగం గ్లాస్ నీటిలో కలపాలి. తరువాత ఆ మిశ్రమంలో ఒక టీస్పూన్ ఆవు నెయ్యి వేసి బాగా కలిపి తాగేయాలి. ఇలా చేయడం వల్ల అసిడిటీ, కడుపులో మంట నుంచి వెంటనే విముక్తి లభిస్తుంది. జీర్ణాశయంలో ఉండే అసౌకర్యం తగ్గుతుంది.
ఇక భోజనం చేసిన అనంతరం చల్లని పాలను తాగాలి. అందులో వీలుంటే చక్కెర కలపవచ్చు లేదా అలాగే తాగవచ్చు. ఇలా చేసినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
ఇవే కాకుండా మరో చిట్కా కూడా ఉంది. అదేమిటంటే.. ఒక కప్పు తీసుకుని అందులో అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అర టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ నల్ల ఉప్పు, ఒకటిన్నర టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని తాగేయాలి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని తీసుకున్న తరువాత కొన్ని నిమిషాల్లోనే అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే మలబద్దకం నుంచి కూడా విముక్తి లభిస్తుంది.