Varicose Veins : మన శరీరంలో గుండె ఎంతో ముఖ్యమైన అవయవం. ఇది నిరంతరాయంగా పనిచేస్తూనే ఉండాలి. అప్పుడే మనం ప్రాణాలతో ఉంటాం. ఇక మన శరీర భాగాలకు గుండె రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ ప్రక్రియకు కవాటాలు ఉపయోగపడతాయి. ఇవి గుండెలో ఉంటాయి. అయితే రక్తనాళాలు లేదా కవాటాలు బలహీనంగా మారినా లేదా వాటిల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడినా.. అప్పుడు రక్తనాళాలు వాపులకు గురవుతాయి. ఉబ్బిపోతాయి. ఇవి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తాయి. ఈ స్థితినే వెరికోస్ వీన్స్ అంటారు. ఈ సమస్య వస్తే ఒక పట్టాన తగ్గదు. కనుక వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి.
ఇక వెరికోస్ వీన్స్ సమస్య ఉన్నవారికి రక్తనాళాలు ఉబ్బిపోయి భరించలేని నొప్పి కలుగుతుంది. దీంతోపాటు శరీరంలోని ఏ భాగాన్ని కదిలించాలన్నా నొప్పి అధికంగా ఉంటుంది. అలాగే కూర్చోవడానికి, నిలబడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. కనుక ఈ సమస్య వచ్చిందంటే ప్రారంభంలోనే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి. ఇక ఈ సమస్య చాలా మందికి వస్తుంటుంది. గర్భిణీలు, అధిక బరువు ఉన్నవారు, డిప్రెషన్‌తో బాధపడుతున్నవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, తగినన్ని నీళ్లను తాగనివారు, అధిక సమయం పాటు కూర్చుని పనిచేసేవారు లేదా వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య వస్తుంటుంది. అయితే వెరికోస్ వీన్స్ సమస్య ఉన్నవారు డాక్టర్ ఇచ్చే మందులతోపాటు కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది. ఇక ఆ చిట్కాలు ఏమిటంటే..
అవిసె గింజలను వేయించి పొడి చేయాలి. అలాగే చియా విత్తనాలను కూడా పొడి చేయాలి. ఈ రెండు పొడులను ఒక టీస్పూన్ చొప్పున తీసుకోవాలి. వీటికి 8 నల్లద్రాక్షలను కలపాలి. రాత్రంతా ఈ మూడింటినీ నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపున వీటిని తినాలి. ఇలా చేస్తుంటే రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో వెరికోస్ వీన్స్ సమస్య నుంచి బయట పడవచ్చు.
అలాగే ఈ సమస్య ఉన్నవారు ఆలివ్ నూనె లేదా కొబ్బరినూనెతో కాళ్లను తరచూ మసాజ్ చేయాలి. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడి వాపులు తగ్గుతాయి. అలాగే వెరికోస్ వీన్స్ సమస్య ఉన్నవారు బయట మనకు లభించే ప్యాకెట్ నూనెలకు బదులుగా గానుగలో ఆడించిన నూనెలను వాడాలి. దీని వల్ల ఈ సమస్య నుంచి త్వరగా బయట పడేందుకు అవకాశాలు ఉంటాయి.