ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను తాజాగా నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం), డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం), డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ.2 లక్షల వరకు ఇస్తారు.
ఈ పోస్టులకు గాను దరఖాస్తు చేసేందుకు నవంబర్ 6ను చివరి తేదీగా నిర్ణయించారు. ఈ పోస్టులకు అప్లై చేసేందుకు గరిష్ట వయో పరిమితిని 55 ఏళ్లుగా నిర్ణయించారు. ఇంటర్వ్యూలో వచ్చిన పెర్ఫార్మెన్స్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏజీఎం లేదా డీజీఎం అయితే రూ.39వేల వరకు జీతం చెల్లిస్తారు. కనిష్ట వేతనం రూ.15,600గా ఉంది. అదే డీజీఎం ఫైనాన్స్ అభ్యర్థులకు అయితే రూ.70వేల నుంచి రూ.2 లక్షల వరకు నెల వేతనాన్ని చెల్లిస్తారు.
అభ్యర్థులు దరఖాస్తు ఫామ్‌లను నింపి నిర్ణీత తేదీలోగా పంపించాల్సి ఉంటుంది. అలాగే ఫామ్, పత్రాలకు చెందిన స్కాన్ కాపీలను కూడా మెయిల్ చేయాలి. డిప్యూటేషన్@ఐఆర్‌సీటీసీ.కామ్ అనే చిరునామాకు మెయిల్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.